Top

ఎవరి మంత్రి పదవికీ గ్యారంటీ లేదు.. అలా చేశారో తక్షణమే తొలగిస్తా:జగన్

దేశమంతా ఏపీవైపు చూసేలా చేయడమే తన లక్ష్యమన్నారు జగన్‌. సీఎంగా బాధ్యతలు చేపట్టినవెంటనే పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చిన జగన్‌.. తొలి కేబినెట్‌లోనే దానిపై దృష్టి పెట్టారు. మంత్రులు ఎవరిపైనైనా అవినీతి ఆరోపణలు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎవరి పదవీకి రెండున్నరేళ్లు గ్యారెంటీ లేదని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తొలి కేబెట్‌ భేటీ ద్వారే సంకేతాలు ఇచ్చారు..

తొలి కేబినెట్‌ భేటీలో పాలన ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సీఎం జగన్‌.. ఏయే శాఖల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో పరిశీలించాలని మంత్రులకు ఆదేశించారు. ఆయా శాఖల్లో జరిగిన అవినీతిని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని నిర్ణయించారు. తన ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలు కారని స్పష్టం చేశారు సీఎం. ఏ మంత్రిపైన అవినీతి ఆరోపణలు వచ్చినా తక్షణమే తొలిగిస్తానని హెచ్చరించారు. ఎవరి మంత్రి పదవికి రెండున్నరేళ్లు గ్యారెంటీ ఉండదన్నారు.

తమది రైతు ప్రభుత్వం అన్నారు జగన్‌. రైతు భరోసా పథకం అక్టోబర్ 15న ప్రారంభం అవుతుందని, ఈ పథకం కింద రైతుకు రూ.12,500 అందజేస్తామన్నారు. ధరల స్థిరీకరణపై కమిషన్‌ వేయాలని సూచించారు. ఈ కమిషన్‌కు ముఖ్యమంత్రి ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. రైతు సంఘం నాయకులు, నిపుణులు ఈ కమిషన్ లో సభ్యులుగా ఉంటారని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు వ్యవసాయ పంట రుణాలకు వడ్డీ లేదు. వడ్డీ కట్టలేని, కట్టని రైతులను బ్యాంకులు అడగొద్దని సూచించారు.

ప్రతి ప్రభుత్వ పథకం గడప గడపకు చేరవేసే విధంగా గ్రామ వాలంటీర్లు పని చేయాలని జగన్‌ సూచించారు. ఆగస్ట్ 15న గ్రామ వార్డు వాలంటీర్ల నియామకం ఉంటుందన్నారు. పట్టణ వాలంటీర్లు డిగ్రీ, గ్రామ వాలంటీర్లు ఇంటర్మీడియట్, గిరిజన ప్రాంత వాలంటీర్లు పదో తరగతి తప్పనిసరిగా పాసై ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో అర్హత కలిగి ఇళ్లు లేని వారిని అందరినీ గుర్తించి ప్రభుత్వం ఆయా గ్రామాల్లో భూములు కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఉగాది రోజున పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1వ తేదీ నుండి 27 శాతం మధ్యంతర భృతిని అమలు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి 815 కోట్ల రూపాయల అదనపు వ్యయం అవుతుంది. అయినా 4.24 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేబినెట్‌ అభిప్రాయపడింది ముఖ్యంగా సీపీఎస్ రద్దుకు సూత్రప్రాయంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర విద్యా క్రమబద్దీకరణ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఈ కమిషన్ ఏర్పాటు ద్వారా విద్యా పర్యవేక్షణ, సహేతుకమైన ఫీజు.. నాణ్యమైన విద్య, ఆర్ టీఈ వంటి అన్ని అంశాలను సమీక్షించి మంచి విద్యా విధానాన్ని రూపొందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించడంతో పాటు ఎక్కువ వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. అలాగే ఆశా వర్కర్ల వేతనాన్ని 3 వేల రూపాయల నుండి 10 వేలకు పెంచుతూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. గత ప్రబుత్వంపై వచ్చిన ఆరోపణలను దృష్టిలోపెట్టుకుని అవినీతికి తావులేని ఇసుక విధానాన్ని అమలు చేయలని మంత్రిమండలి నిర్ణయించింది.

ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. దీనిని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో రవాణా, ఆర్థిక శాఖా మంత్రులు ఉంటారని. వీరితో పాటు నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. అలాగే ఇప్పటివరకు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను పునః సమీక్షించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యుత్ కోతల్లేకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు లబ్ధి చేసేందుకు తక్షణమే 1150 కోట్ల రూపాయలను కోర్టులో జమ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. 20వేల రూపాయల లోపు డిపాజిటర్లకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Next Story

RELATED STORIES