ఉద్యోగం వచ్చి ఏడాదైంది.. పెళ్లై నెల దాటింది.. అంతలోనే..

ఉద్యోగం వచ్చి ఏడాదైంది.. పెళ్లై నెల దాటింది.. అంతలోనే..

ఉద్యోగంలో చేరి ఏడాదైంది.. పెళ్లయి నెల రోజులు అయింది. అంతలోనే అతన్ని మృతువు కాటేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. రంగారెడ్డి జిల్లా లక్ష్మీనగర్‌ తండాకు చెందిన వాల్యానాయక్, హేమ్లీబాయి దంపతులకు నలుగును సంతానం. వారిలో రెండో కుమారుడు తులసీరామ్ డిగ్రీ పూర్తి చేసి 2018లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఎంపికై రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవరంపల్లి ఠాణాలో విధులు నిర్వహిస్తున్నాడు. తులసీరామ్‌కు మే 8వ తేదిన పూడూరు మండలం బొంగుపల్లితండాకు చెందిన మౌనికతో వివాహమైంది. అయితే ఇటీవల ఓ యువతి కిడ్నాప్‌ కేసులో బిహార్‌ రాష్ట్రానికి వెళ్లి నిందితుడిని తీసుకొని వాహనంలో వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ తులసీరామ్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు, కాళ్ల పారాణి కూడా ఆరకముందే భర్త చనిపోవడంతో నవ వధువు పుట్టెడు దుఃఖంలో మునిపోయారు.

మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కుషాల్‌ ప్లాస్టిక్‌ పరిశ్రమలో బిహార్‌ రాష్ట్రానికి చెందిన రోషన్‌,అంకిత, పనిచేస్తున్నారు అక్కడ ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అంకితను పని మాన్పించారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న అంకితను రోషన్‌ బిహార్‌కుతీసుకొని వెళ్లిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఓ పోలీస్ బృందం బిహార్‌కు వెళ్ళింది. ఆ టీమ్‌లో కానిస్టేబుల్‌ తులసీరామ్ కూడా ఒకరు. వారు నిందితుడిని తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో టైర్‌ పేలి జరిగిన ప్రమాదంలో నిందితుడు రోషన్‌తోపాటు కానిస్టేబుల్‌ తులసీరామ్ మృతి చెందారు. పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే తులసీరామ్‌ మృతి చెందడం పట్ల పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story