Top

ఆ చెల్లింపులను ఎందుకు ఆపారు.. జగన్‌కు బాబు సూటి ప్రశ్న

ప్రభుత్వాలు మారినప్పుడల్లా నిర్ణయాలు కూడా మారుతుంటాయి.. అయితే, విధానాలు మార్చడాన్ని టీడీపీ ప్రశ్నిస్తోంది.. రైతులకు చెల్లించాల్సిన రుణమాఫీ వాయిదాలపై జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించిన అధినేత చంద్రబాబు.. రైతురుణమాఫీ విషయంలో పోరాటంపై వారికి దిశానిర్దేశం చేశారు.

అసెంబ్లీలో సంఖ్యా పరంగా తక్కువగా వున్నా వాయిస్‌ ఏమాత్రం తగ్గకూడదని టీడీపీ డిసైడైంది. నాడు రైతులకిచ్చిన హామీ నెరవేరేలా పోరాట ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. తమ ప్రభుత్వ హాయంలో అమలు చేసిన రైతు ఉపశమన పథకంలో 4, 5వ విడత కిస్తీలను ప్రస్తుత సర్కార్ రైతులకు చెల్లించాల్సిందేనని టీడీపీ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగిన తర్వాత చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం నిర్వహించారు. రుణమాఫీ నాలుగు, ఐదు వాయిదాలు ప్రభుత్వం ఇవ్వదంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.. రుణమాఫీపై న్యాయపరమైన హక్కు ఉన్నందున రైతులు కోర్టుకెళ్లే అవకాశం ఉందని భేటీలో ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.

దీనిపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వాలు మారినా విధానాలు మారవన్నారు. వడ్డీతోపాటు రైతులకు ఇవ్వాల్సిన మొత్తాలను వెంటనే చెల్లించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రుణమాఫీ అనేది ఆన్ గోయింగ్ ప్రాసెస్‌ అని, దాన్ని పార్టీ హామీగా భావించి అన్నదాతలకు అన్యాయం చేయడం తగదన్నారు. గతంలో యూపిఏ తెచ్చిన నరేగా పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగించిందని, పెండింగ్ బిల్లులను నిలిపివేయలేదని గుర్తుచేశారు. అలాగే ఎన్టీఆర్ వైద్యసేవ పెండింగ్ బిల్లులను కూడా ప్రభుత్వం మారిందని రోగులకు ఇవ్వకపోవడం జరగదన్నారు. మరి రుణమాఫీ చెల్లింపులను రైతులకు ఎలా నిలిపివేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

రైతు రుణమాఫీలో భాగంగా 4, 5వ విడతలకు సంబంధించి రైతుల ఖాతాల్లో 376 కోట్ల రూపాయలను గత చంద్రబాబు ప్రభుత్వం జమ చేసింది. ఇంకా 7 వేలా 980 కోట్లు అందాల్సి వుంది. ఉద్యాన రైతులకూ చెల్లింపులు జరగాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వ ఆలోచనల నేపథ్యంలో ఈ అంశంపై శాసన సభలో, మండలిలో పోరాడాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబు నిర్ణయించారు. అలాగే అక్టోబర్ 15నుంచి రైతు భరోసా అమలు చేయనున్నందున... ఖరీఫ్‌కు ఉపయోగపడేలా అన్నదాత సుఖీభవ కిస్తీని అందజేయాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కోరారు.

Next Story

RELATED STORIES