రోడ్డు ప్రమాదంలో 'జబర్దస్త్' చంటికి గాయాలు..

ఏంటో.. టైం బ్యాడ్‌గా నడుస్తున్నట్టుంది నటుల విషయంలో. గత రెండు మూడు రోజులుగా షూటింగులో గాయాలపాలైన నటులు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. నటుడు శర్వానంద్, నాగశౌర్య, సందీప్ కిషన్, వరుణ్ తేజ్. తాజాగా బుల్లితెర ఫేమస్ కామెడీ షో జబర్దస్త్‌లో నటించే చలాకీ చంటి కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఆయన చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. మంగళవారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆరు గంటల సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ వద్ద చంటి కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న కోదాడ పోలీసులు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. చంటిని కోదాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం చంటి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. గత ఏడాది కూడా జూన్ నెలలోనే చంటి కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు చంటి. అయితే ఆనాటి ప్రమాదంలో గుద్దుకున్న రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. సరిగ్గా ఏడాది తరువాత అదీ జూన్ నెలలోనే ప్రమాదానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com