గుర్రుగా గులాబీ నేతలు.. మంత్రిపై ఆగ్రహం..

గుర్రుగా  గులాబీ నేతలు.. మంత్రిపై ఆగ్రహం..

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు చేయకపోడవంతో గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. బీజేపీ అధినేత అమిత్ షా పర్యటన అందివచ్చిన అవకాశంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీపై ట్వీట్లతో ధ్వజమెత్తారు కేటీఆర్‌.

బీజేపీపై విమర్శల జోరు పెంచింది అధికార టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై మోదీ సర్కార్ తీవ్ర అన్యాయం చేస్తుందని ఆరోపించారు టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినా ఏం అంశంపై రాష్ట్రానికి కేటాయింపులు చేయలేదన్నారు. బడ్జెట్ తమను తీవ్ర నిరాశ పర్చిందని కేటీఆర్ వరుస ట్వీట్లు చేసారు. ఆర్ధిక సర్వేలో తెలంగాణ చొరవను సీతారామన్ పొగిడినప్పటికి.. రాష్ట్ర ప్రతిపాదనలను మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. మిషన్ కాకతీయ, భగీరథలకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించిందని.. కానీ ఇంత వరుకు బడ్జెట్ లో 24 రూపాయలు కూడా కేటాయించలేదన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఐదేళ్లు పూర్తయినా ఏపీ విభజన చట్టంలోని హామీలను పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు కేటీఆర్. బయ్యారం ఉక్కు పరిశ్రమ, వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీకి నిధులు ఎందుకు ఇవ్వలేదన్నారు. పెట్రోల్ ధరలను భారీగా పెంచటం యూపీఏ ప్రభుత్వ వైఫల్యం అని నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్.. నిర్మలా సీతారామన్ గుర్తుకు తెచ్చుకోండని కేటీఆర్ గుర్తు చేసారు.

అటు మాజీ ఎంపీ కవిత కూడా పసుపు బోర్డు హామీ ఏమైందని ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడిని టార్గెట్‌ చేశారు టీఆర్‌ఎస్‌ నేతలు. రాష్ట్రానికి ఏం న్యాయం చేసారని ఇక్కడ పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న దాని కంటే కూడా రెట్టింపు నిధులు పన్నులు రూపంలో కేంద్రానికి ఇస్తున్నామని అంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు.

మొత్తానికి తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారాయి. త్వర‌లో మున్సిప‌ల్ ఎన్నిక‌లు రానుండ‌టం.. మ‌రో ప‌క్క బీజేపీ పూర్తిస్థాయిలో రాష్ట్రంలో పాగా వేయాల‌ని చూడ‌టంతో రాజ‌కీయం మ‌రింత రంజుగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story