ఉత్తరభారతాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు

ఉత్తరభారతాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు

భారీ వర్షాలతో ఉత్తర భారతం అతలాకుతలం అవుతోంది. యూపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. 14 జిల్లాలో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి 15 మంది మృతి చెందారు. భారీగా జంతు, ఆస్తి నష్టం సంభవించింది. వర్షం ప్రభావం వల్ల 133 భవనాలు నేలకూలాయి. ఉన్నావూ, అంబేడ్కర్‌ నగర్‌, గోరఖ్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, బారాబంకి, హర్దోయ్‌, కాన్పూర్‌ నగర్‌, పిలిభిట్‌, సోనాభద్ర, చందోలి, ఫిరోజాబాద్‌, మావూ, సుల్తాన్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో ఐదు రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు IMD తెలిపింది.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా పట్టణాల్లో వరదల కారణంగా రోడ్లపై నీరు నిలిచింది. జనజీవనం అస్తవ్యస్థమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల 10 మంది చనిపోయారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు కొండచెరియలు విరిగిపడి ఇద్దరు విద్యార్థులు సజీవసమాధి అయ్యారు.యూపీతో పాటు ఉత్తరాఖండ్‌, తూర్పు యూపీ, ఝార్ఖండ్‌, మధ్య మహారాష్ట్ర, కొంకణీతీరం, గోవా, కర్ణాటకలోని తీర ప్రాంతాలు, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపురలో భారీ వర్ష సూచన ఉన్నట్లు IMD వెల్లడించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

మహారాష్ట్రలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగ్‌పూర్‌లో వర్షాలకు మట్టిదిబ్బలు పడి ముగ్గురు చనిపోయారు. అటు ముంబయిలోనూ రాబోయే 48 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్రపై తుఫాను ప్రభావం ఉండవచ్చని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు ముంబయి జనజీవనం అస్తవ్యస్థమైంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ముంబై వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story