జగనన్న జంపింగ్ జపాంగ్.. లోకేష్‌ సెటైరికల్ ట్వీట్‌

జగనన్న జంపింగ్ జపాంగ్..  లోకేష్‌ సెటైరికల్ ట్వీట్‌

ఏపీ బడ్జెట్‌పై విరుచుకుపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌. ట్విట్టర్‌ వేదికగా సర్కార్‌ తీరును ఎండగట్టారు. రైతుల్ని, అమ్మఒడి లబ్ధిదారుల్ని సీఎం జగన్‌... అవమానించారంటూ ట్వీట్‌ చేశారు. బడ్జెట్ చూస్తుంటే.. జగన్‌ నామమాత్ర సీఎంలా అనిపిస్తున్నారంటూ సెటైర్‌ వేశారు లోకేష్‌.

జగన్‌ ప్రభుత్వ బడ్జెట్‌పై... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌..... ట్విట్టర్‌ వేదికగా సెటైర్లతో రెచ్చిపోయారు బడ్జెట్ లో జగన్ కేటాయింపులే నామమాత్రమా? లేక.. హామీలు కూడా నామమాత్రమా? అంటూ ఎద్దేవా చేశారు. చూస్తుంటే జగన్‌ నామమాత్ర ముఖ్యమంత్రిలా అనిపిస్తున్నారన్నారు. రైతుల వడ్డీలేని రుణాలకు 3 వేల 500 కోట్లు ఎందుకు కేటాయించలేదని.. ఇదేనా మీ చిత్తశుద్ధి అంటూ ప్రశ్నించారు లోకేష్‌. గత ప్రభుత్వం అసలేమీ ఇవ్వలేదని ఒకరోజు, ఇంతే ఇచ్చిందని మరోరోజు విమర్శించిన జగన్‌ ప్రభుత్వం... తీరా బడ్జెట్ లో నామమాత్రంగా వంద కోట్లు మాత్రమే కేటాయించారంటూ సెటైర్‌ వేశారు లోకేష్.

పథకాలకు పేర్లు తగిలించుకుని మురిసిపోతున్నారు సరే... అమ్మ ఒడిలో లబ్దిపొందే తల్లుల సంఖ్యను సగానికి తగ్గించడం ఏంటని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఒక తల్లికి ఇచ్చి, మరో తల్లికి ఇవ్వకుండా స్కిప్ చేసుకుంటూ, జంపింగ్ జపాంగ్ ఆటలాడతారా? అంటూ ఎద్దేవా చేశారు. పథకానికి కూడా 'జగనన్న జంపింగ్ జపాంగ్' అని పేరు పెడితే బాగుండేదంటూ సెటైరిక్‌గా ట్వీట్‌ చేశారు లోకేష్‌.

మరోవైపు ఆర్థిక మంత్రి బుగ్గనకూ చురకలంటించారు. ఆర్థికమంత్రిగారు రామాయణమంతా చదివారని... సంజీవని గురించి చెప్పారన్నారు. వైద్య ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ప్రభుత్వమే చూసుకుంటుందని ఊదరకొట్టారన్నారు. కానీ చివరికి ఆరోగ్యశ్రీకి 1740 కోట్లు విదిల్చారని విమర్శించారు. ఇక ఐదేళ్ళలో 25 లక్షల ఇళ్ళు కడతామని... గృహరుణాలన్నీ రద్దు చేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో కేవలం 8 వేల 615 కోట్లు మాత్రమే ఇచ్చారంటూ ట్వీట్‌ చేశారు. ఇంతకీ జగన్ నిర్మిస్తామన్నది పిచ్చుక గూళ్ళు కాదుకదా అంటూ లోకేష్‌ ఎద్దేవా చేశారు.....

అంతకుముందు.. మరో ట్విట్టర్‌లోనూ బడ్జెట్‌పై తీవ్రంగా విమర్శించారు లోకేష్‌. ప్రభుత్వం కోసిన కోతలకు.. బడ్జెట్‌లో కేటాయింపులకు పొంతనే లేదన్నారు. దీనిపై వైసీపీ సభ్యులకు ముందే తెలిసినట్టుంది. బడ్జెట్‌పై సొంత పార్టీ నేతలే గుర్రు పెట్టారంటే.. జగన్‌ హామీలను గుర్తుంచుకుని బడ్జెట్‌ విన్న ప్రజల పరిస్థితి ఏంటో? అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు బడ్జెట్ స్పీచ్ సమయంలో సభలో నిద్రపోతున్న చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి దృశ్యాన్ని ట్విట్‌కు జతచేశారు నారా లోకేష్‌. మొత్తానికి.. వరుస ట్వీట్‌లతో.. జగన్‌ సర్కారు టార్గెట్‌గా.. తీవ్ర విమర్శలు చేశారు లోకేష్‌.

Tags

Read MoreRead Less
Next Story