ఏపీలో గందరగోళంగా మారిన ఆ పోలీస్‌ బాస్‌ల భవిష్యత్తు

ఏపీలో గందరగోళంగా మారిన ఆ పోలీస్‌ బాస్‌ల భవిష్యత్తు

ఏపీలో సూపర్ న్యూమరీ డీఎస్పీ పోస్టులు పొందిన పోలీసుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. సూపర్ పోలీస్ తరహాలో హడావుడి ప్రమోషన్ లు ఇచ్చిన ప్రభుత్వం..వారిని ఇంకా రెగ్యులర్ చేయకపోవటంతో ఆయోమయంలో పడ్డారు. ఒంటి మీద డీఎస్పీ యూనిఫాం ఉన్నా..సీఐ డ్యూటీలే చేస్తుండటంతో తమకు ప్రమోషన్ వచ్చిందా? రాలేదా? సూపర్ పోలీసులకే అర్దం కావటం లేదు. భవిష్యత్తులో ప్రమోషన్ సమయంలో సర్వీస్ పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది.

ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్లో 1991 బ్యాచ్ ఎస్ఐల ప్రమోషన్ త్రిశంకు స్వర్గంలా మారింది. సర్వీస్ రూల్స్ ను పట్టించుకోకుండా ఏర్పాటు చేసిన సూపర్ న్యూమరీ పోస్టులు ఏకంగా 169 పోలీసు అధికారుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. 1991 బ్యాచ్ కు చెందిన ఎస్ఐలు వారు పనిచేసే పోలీస్ రేంజ్ లలో సీనియారిటీ ప్రకారం సిఐలుగా పదోన్నతులు పొందారు. వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. అయితే.. రాష్ట్ర విభజన సమయంలో డీఎస్పీలుగా ప్రమోషన్ లిస్టులో ఉన్నవాళ్లందరికీ పదోన్నతులు కల్పించాలి. సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతులు కల్పించాలి. అయితే అప్పటికే సీఐగా పదోన్నతులు పొందిన 1991 బ్యాచ్ ఆఫీసర్లను అప్ గ్రేడ్ చేసి 2014 సెప్టెంబర్ నెలలో 169 డిఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. కానీ, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రమోషన్లను సూపర్ న్యూమరీ పోస్టులుగా పరిగణించాలని జీవోలో ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం.

నిజానికి డిపార్ట్ మెంట్లో ప్రమోషన్ కల్పించాలంటే పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సమావేశమై పదోన్నతులు కల్పించి ఆ తరువాత పోస్టింగ్ ఇవ్వాలి. అయితే 2014 సెప్టెంబర్ విడుదలైన జీవోతో 169 సూపర్ న్యూమరీ డీఎస్పీ పోస్టులను రూపొందించారు. మొదటి దశలో 123 మంది సిఐలను అప్ గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించారు. అయితే..ఈ సూపర్ న్యూమరీ పోస్టుల క్రియేషన్ లోనే పెద్ద ట్విస్ట్ ఉంది. సూపర్ న్యూమరీ పోస్టులను రూపొందించక ముందే 1991 బ్యాచ్ కు చెందిన 20మందిని డీఎస్పీలుగా ప్రమోట్ చేశారు. విశాఖ రేంజ్ లోనూ, రాయలసీమ పరిధిలోనూ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ బోర్డు సమావేశమవకుండానే ప్రమోట్ చేశారు.

ఆ 20 మందికి ఇష్టారీతిన ప్రమోషన్ ఇచ్చినా..సర్వీస్ రూల్స్ ప్రకారం తిరిగి సిఐలుగా రివర్షన్ పొందాలి. దీంతో ఆ 20 మందిని రక్షించేందుకు నేతల ప్రమేయంతో అదే బ్యాచ్ కు చెందిన 140 మంది కోసం సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేశారనేది పోలీస్ శాఖలో బహిరంగ రహస్యం. అర్హత లేకుండా..పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ బోర్డు ఆమోదం లేకుండా పదోన్నతులు ఎందుకు కల్పించారనేది ప్రశ్నగా మిగిలిపోయింది.

20 మంది కోసం 140 మంది సూపర్ న్యూమరీ డీఎస్పీలుగా పదోన్నతులు పొందినా..ఆ ఆనందంద యూనిఫాం వరకే పరిమితం అయ్యింది. డీఎస్పీ పొజిషన్ లో సీఐ విధులనే నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లు అయినా రెగ్యులర్ కాకపోవటంతో వారి సీనియారిటీ ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటారో అర్ధంకాని పరిస్థితి సర్వీసు రెగ్యులర్ కాకపోవటంతో తదుపరి అడిషనల్ ఎస్పీ లుగా ప్రమోషన్స్ లో అర్హత ఉంటుందో లేదో తెలియని అయోమయంలో ఉన్నారు. సూపర్ న్యూమరీ డీఎస్పీలుగా దాదాపు నాలుగేళ్లుగా సర్వీసు పూర్తిచేసుకున్నప్పటికీ రెగ్యులర్ చేయకపోవటంతో అర్హత ఉండి కూడా సబ్ డివిజనల్ అధికారులుగా నియమించకపోవటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమోషన్ వచ్చిందో రాలేదో తెలియదు. ఈ నాలుగేళ్ల సర్వీస్ ను ఎలా పరిగణలోకి తీసుకుంటారో లేదో అర్ధం కాదు. తర్వాత ప్రమోషన్ అర్హులో కాదో అసలే అంతుచిక్కదు. రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతుండటంతో కొద్ది మంది న్యాయస్థానాలను అశ్రయించారు. అయితే..సూపర్ న్యూమరీ పోస్టుల్లో మరో ట్విస్ట్ ఏటంటే..ఇదే 1991 బ్యాచ్ చెందిన వాళ్లలో విశాఖ రేంజ్ లో రెగ్యులర్ డిఎస్పీలుగా సబ్ డివిజనల్ అధికారులుగా పనిచేస్తున్నారు. మిగిలిన వారు సూపర్ న్యూమరీ డీఎస్పీలుగా కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగించే అంశం.

Tags

Read MoreRead Less
Next Story