'కౌగిలింతల' ఉద్యోగంతో పాటు మనీ వచ్చే 'మరికొన్ని' ఉద్యోగాలు..

కౌగిలింతల ఉద్యోగంతో పాటు మనీ వచ్చే మరికొన్ని ఉద్యోగాలు..

ఆఫీస్‌కి వెళ్లి పని చేయాలంటే బద్దకం. ఇంట్లో కూర్చుని చేసే ఉద్యోగం అయితే ఎంత బావుండు. కష్టపడకుండా.. కాలు కదపకుండా కాసులతో జేబు నిండితే ఆహా! ఏమి హాయిలే హలా అని పాడుకోవచ్చు. అవునండి అచ్చంగా అలాంటి ఉద్యోగాలే ఇవి.. మీరు ట్రై చేస్తారా.. ఇంతకీ లిస్టులో ఏమేం ఉద్యోగాలున్నాయో.. అలా బేవార్స్‌‌లా తిని తిరక్కపోతే ఏదో ఒక ఉద్యోగం చేయొచ్చుగా అనే నాన్నకు చెప్పడానికి మనకో ఉద్యోగం ఉంటుంది. చూసేద్దాం పదండి ఆ ఉద్యోగాలేంటో ఓసారి..

శాంటాక్లాజ్‌ తాతకి క్రిస్‌మస్ రోజుల్లో బోలెడు ఉత్తరాలు వస్తుంటాయి పేరున్న చర్చిలు అన్నింటికి. పండుగ శుభాకాంక్షలు చెప్పేవారు కొందరైతే.. కోరికల చిట్టా విప్పే వారు మరి కొందరు.. ఇలా చాలా ఉత్తరాలే అందుతాయి క్రిస్‌మస్ తాతకి. మరి వాటన్నింటికి ఓపిగ్గా రిప్లై ఇస్తే అవతలి వారు ఎంత సంతోషిస్తారో కదా.. అందుకే ఆ రిప్లై రాసే వ్యక్తులకోసం కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. ఎంచక్కా అందమైన ఆణిముత్యాల్లాంటి అక్షరాలతో ఉత్తరం రాయడమే మీ ఉద్యోగం. ఒక్కో ఉత్తరానికి సమాధానం రాసినందుకు గాను 10 డాలర్లు ఇస్తారట. బావుంది కదా.. ఇలాంటి ఉద్యోగమేదో మనకీ వస్తే బ్రహ్మాండంగా చేసేయొచ్చు అని అనుకుంటున్నారు కదూ.

ఇక నెట్‌ప్లిక్స్ గురించి తెలియని వారెవరు. అందులో వచ్చే ప్రతీ షోను చూసి ఓ నాలుగైదు వాక్యాల్లో స్టోరీ మొత్తం చెప్పేయాలి. ఇందుకోసం నియమించిన ఉద్యోగులకు సంస్థ ఇచ్చే శాలరీ వారానికి వంద డాలర్లపైనే అంట. ఉద్యోగం సూపర్ కదా.

ఆప్యాయపు కౌగిలింత.. ప్రేమ పూర్వకపు కౌగిలింత.. ఆనందంతో పాటు ఓ తెలియని మధురానుభూతి కలుగుతుంది కౌగిలింతలో. మరి అలాంటి కౌగిలింత మీరిస్తానంటే ఈ ఉద్యోగం మీకే. అమెరికా, చైనా, పోర్ట్‌లాండ్ తదితర దేశాల్లో ఇందుకోసం ఏకంగా సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగులను నియమించుకుంటున్నారు. ఎవరైనా కౌగిలింత కావాలనుకుంటే గంటకు 60 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఓన్లీ కౌగిలింతేనండి.. అంతకు మించి అడ్వాన్స్ అయ్యారో చెంప ఛెళ్లుమంటుంది.

మరో ఉద్యోగం.. ఇంకా ఈజీ జాబ్ ఇది.. సాధారణంగా గోల్ఫ్ కోర్టులు చాలా వరకు సరస్సులు, నదుల ఒడ్డునే ఉంటాయి. గోల్ఫ్ ఆడే క్రీడాకారులు కొన్ని సార్లు బంతిని గట్టిగా కొడితే సరస్సులో పడిపోతుంటాయి. అలా నీళ్లలో పడ్డ ఆ బంతులను తెచ్చి పెట్టడమే ఉద్యోగి విధి. ఇలా బంతులను తెచ్చిస్తే అలా మీ అకౌంట్లో ఏడాదికి 33 వేల డాలర్ల జీతం పడిపోతుంది. ఇలాంటి ఉద్యోగం చేయాలంటే అమెరికా, ఇంగ్లాండ్‌లోనే సాధ్యం మరి.

మరో ఉద్యోగం ఏంటంటే పరుపు మీద పడుకుని రివ్యూ రాయడమే. ఆ హోటల్‌లో బెడ్ ఎలా ఉంది.. ఫుడ్డు ఎలా ఉంది అంటూ.. దాదాపుగా అన్ని ట్రావెల్స్ సంస్థలు తమ వినియోగదారులకు మంచి హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయాలని భావిస్తారు. అందుకు ఆయా సంస్థలు కొందరు ఉద్యోగులను నియమించుకుని మరీ హోటల్స్‌లో సదుపాయాల గురించి రివ్యూ రాయమంటుంది. ఇందుకుగాను ఉద్యోగికి ఏడాదికి 48 వేల డాలర్లు జీతంగా ఇస్తారు. ఫ్రీ ఫుడ్డు, ఫ్రీ బెడ్డుతో పాటు జీతం.. ఇంకేం ఇంకేం కావాలి అని పాడుకోవడమే తరువాయి.

చైనాలో కూడా ఇలాంటివి కొన్ని ఉద్యోగాలు ఉన్నాయండోయ్.. ఏవైనా అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నప్పుడు అనేక సంస్థలు హాజరవుతుంటాయి. పలు సంస్థలు మాత్రం ఆ సమావేశాలకు తమ ఉద్యోగులను పంపకుండా నకిలీ ప్రతినిధులను పంపిస్తుంది. అలా సంస్థ తరపున హాజరైన వ్యక్తి కంపెనీ గురించి, సంస్థ కార్యకలాపాల గురించి వివరించాలి. ఇందుకోసం వారానికి 1000 డాలర్లు ఇస్తుంది ఆ ఉద్యోగికి సంస్థ.

ఈ ఉద్యోగాలే కాదండోయ్ చేయాలంటే చాలా ఉన్నాయ్.. చాక్లెట్, ఐస్‌క్రీమ్, కాఫీ, మద్యం వంటి ఉత్పత్తుల రుచి చూసే ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలుగా ఉంటాయి. పన్లేదు కదా అని అప్లై చేసుకుంటానంటే కుదరదు. ఆ చేస్తున్న పనిలో ఫర్‌‌ఫెక్షన్ ఉండాలి. అప్పుడే ఆకర్షణీయమైన జీతం అందుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story