సీఎం జగన్‌పై చంద్రబాబు ధ్వజం

వైసీపీ ప్రభుత్వ తీరుపై ట్విట్టర్‌ వేదికగా మరోసారి తీవ్రంగా మండిపడ్డారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై కాకుండా టీడీపీపై బురద జల్లేందుకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. సీఎం జగన్ కనుసన్నల్లో నడిచిన సమావేశాల్లో వైసీపీ హామీలపై ప్రజల తరపున నిలదీసిన ప్రతిపక్ష నేతల గొంతునొక్కి, సస్పెండ్ చేశారంటూ ఫైరయ్యారు. ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రభుత్వం నీరుగార్చిందని చంద్రబాబు విమర్శించారు.

సభలో హుందాగా వ్యవహరించాల్సిన అధికారపక్ష సభ్యులు.. దిగజారి ప్రవర్తించారని చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి బుగ్గన గారి అభూత కల్పనలు, సీఎం జగన్ గురించి ఇతర సభ్యుల భజన కార్యక్రమాలు చూసి జనం ముక్కున వేలేసుకున్నారని అన్నారు. సభలో ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టబోయి.. ప్రభుత్వమే ఇబ్బందుల్లో పడిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

Tags

Next Story