కశ్మీర్‌ నిర్ణయాన్ని పీ5 దేశాలకు తెలిపిన భారత్‌

కశ్మీర్‌ నిర్ణయాన్ని పీ5 దేశాలకు తెలిపిన భారత్‌

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్న విషయాన్ని ఐక్యరాజ్య సమితికి తెలియజేసింది భారత్. కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఐరాస భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలకు తెలియజేసింది. జమ్ముకశ్మీర్‌పై పార్లమెంటులో జరిగిన, జరగబోయే పరిణామాలను అమెరికా, రష్యా, బ్రిటన్‌, చైనా, ఫ్రాన్స్‌ రాయబారులకు వివరించారు. ఇది పూర్తిగా భారత్‌ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ.. ఆయా దేశాల ఆసక్తి మేరకు ఈ అంశాన్ని వివరించినట్టు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్‌లో సుపరిపాలన, సామాజిక న్యాయం, ఆర్థిక అభివృద్ధికి అధికరణ 370 రద్దు, రాష్ట్ర విభజన దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు.

జమ్ము కశ్మీర్ విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అమెరికా స్పందించింది. నియంత్రణ రేఖ వెంబడి భాగస్వామ్య పక్షాలన్నీ శాంతి, సుస్థిరతలకు కృషి చేయాలని ఆదేశ ప్రతినిధి సూచించారు. అలాగే ఐక్య రాజ్యసమితి అధికార ప్రతినిధి కూడా స్పందించారు. భారత్‌ తీసుకుంటున్న నిర్ణయాలపై పూర్తి సమాచారం తమకు ఉందని స్పష్టంచేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సంయమనం పాటించాలని సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story