ఇళ్లలోకి గోదావరి.. లంక గ్రామాల్లో ఎటు చూసినా నీరే

ఇళ్లలోకి  గోదావరి.. లంక గ్రామాల్లో ఎటు చూసినా నీరే

శాంతించినట్టే శాంతించిన గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది.. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర గోదారిలా మారుతోంది.. వందలాది లంక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకోగా.. పోలవరం దగ్గర గోదావరి ఉధృతిని చూసి ముంపు గ్రామాల ప్రజలు భయం భయంగా బతుకీడుస్తున్నారు.

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని విలీన మండలాల్లో జనజీవనం స్తంభించింది. వీఆర్‌ పురం, చింతూరు మండలాల మధ్యలో దాదాపు 30 గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. అనేక లంక గ్రామాలకు నిత్యావసరాలు అందడం లేదు. అయితే రాబోయే వరదను దృష్టిలో ఉంచుకొని శ్రీరామగిరి, చింతరేవులపల్లి గ్రామాల దగ్గర SDRF బృందాలు మోహరించాయి.

గోదావరి వరదల కారణంగా కోనసీమలోని లంక గ్రామాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది.. చింతరేవులపల్లి గ్రామంలో యటపాక డీఎస్పీ జేవీ సంతోష్ తన సిబ్బందితో కలిసి నిత్యావసర వస్తువులు అందించారు. రేకపల్లి ప్రభుత్వాసుపత్రిలో గర్భిణీలను కలిసి వారి బాగోగులు తెలుసుకున్నారు. మరోవైపు అధికారులు తమను పట్టించుకోవడం లేదని చింతూరు మండలంలోని వరద బాధితులంటున్నారు. చుట్టూ ఎటు చూసినా నీరే కనిపిస్తోందని, రాత్రి వేళల్లో కరెంట్ పోతే చాలా ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. కిరోసిన్ దీపాలు అందజేయాలని కోరుతున్నారు.

కుక్కునూరు-దాచారం మధ్య గొండేటి వాగుపై కాజ్‌వే మునిగి రాకపోకలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి దిగువన ఉన్న ఆచంట మండలంలో సుమారు మూడు అడుగుల మేర నీటిమట్టం తగ్గింది. అయితే, ప్రధాన రేవులన్నీ ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మధ్య పంటు రాకపోకలు నిలిపివేశారు. పోలవరానికి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో పాత పోలవరం ముంపు గ్రామ ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. వరద నీరు రాకుండా గత ప్రభుత్వ హయాంలో ఐదు కిలోమీటర్ల మేర భారీ ఏటిగట్టు నిర్మించారు. అయితే రాయితో రివిట్‌మెంట్‌ చేయకపోవడంతో ఆ కట్ట కొట్టుకుపోతుంది. దీంతో ఏ సమయంలో వరద తమ గ్రామాన్ని ముంచెత్తుతుందోనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి ఉప్పొంగుతోంది. అయితే, ఇప్పుడిప్పుడే వరద కొంత తగ్గుముఖం పడుతోంది.. భద్రాచలం వద్ద నిన్న సాయంత్రానికి 39.90 అడుగుల నీటి మట్టం నమోదైంది. ధవళేశ్వరం వద్ద 12.10 అడుగుల నీటి మట్టాన్నీ స్థిరీకరించి మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కాటన్‌ బ్యారేజీకి చెందిన 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 10.40 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.

Tags

Read MoreRead Less
Next Story