లోన్ వద్దంటున్నా ఇప్పిస్తామంటూ వెంటపడి.. రూ.11 లక్షలు..

లోన్ వద్దంటున్నా ఇప్పిస్తామంటూ వెంటపడి.. రూ.11 లక్షలు..

మేడమ్ ప్లీజ్.. సార్ ప్లీజ్.. ఓ మంచి అవకాశం.. తక్కువ వడ్డీ రేటుకే లోన్.. తీసుకునేదాకా వెంటపడి వేధించేస్తారు. వద్దు మొర్రో అంటున్నా వినకుండా అంటగట్టేస్తారు. ఇంత తక్కువ వడ్డీ రేటుకి ఇప్పటి వరకు ఏ బ్యాంకులు ఇవ్వలేదు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. అంటూ కూల్‌గా నాలుగు మాటలు చెప్పేసరికి ఐసైపోతారు. మాటలతో బోల్తా కొట్టిస్తారు. అందినకాడికి దోచుకుంటారు. ప్రాసెసింగ్ ఛార్జీల పేరుతో పెద్ద మొత్తంలో సొమ్మును ఖాతాలకు బదిలీ చేయించుకుని మాయమవుతారు. నోయిడా కేంద్రంగా లోన్ల పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి ఐ-టెన్ కారు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లోని బులందేశ్వర్‌కు చెందిన పవన్ కుమార్, గజియాబాద్‌కు చెందిన రాహుల్ పాంచల్, ముకేశ్ చక్రవర్తి నోయిడా కేంద్రంగా పనిచేసిన బీఎంఏ అనే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో టెలీ కాలర్లుగా పనిచేశారు. అయితే కంపెనీ నిబంధనలకు అనుగుణంగా లేదని అధికారులు మూసివేశారు. అక్కడ పని చేసిన ఈ ముగ్గురు కంపెనీలో పని చేసిన అనుభవంతో పాత కస్టమర్లను ట్రాప్‌లో పడేశారు. లోన్ పేరుతో డబ్బు సంపాదించాలనుకున్నారు. ముగ్గురూ కలిసి తక్కువ వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని కస్టమర్లను ఆకర్షించారు. కానీ వారి ఆటలు ఎంతో కాలం సాగలేదు.

కస్టమర్ల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని డబ్బులు గుంజుతున్న వైనాన్ని కొండాపూర్‌కు చెందిన గోవింద్ భట్ పసిగట్టాడు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్టు చేశారు. భట్ తాను మోసపోయిన విధానాన్ని వివరిస్తూ.. 5 శాతం వడ్డీకే రూ.5 లక్షలు లోన్ ఇస్తామంటే ఆశపడ్డానని.. అయితే లోన్‌కు సిద్ధమవుతున్న సమయంలో మీకు స్పెషల్ ఆఫర్ అంటూ రూ.10లక్షలు లోన్ ఇస్తామన్నారు. దానికి ప్రాసెసింగ్ ఫీజుగా రూ.24,999 చెల్లించాలని బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చారు. అలా మొదలు పెట్టి భట్ వద్దనుంచి దాదాపు రూ.11 లక్షల 20 వేల రూపాయలను దోచుకున్నారు. అంత పెద్ద మొత్తంలో సొమ్ము పోగొట్టుకున్నాక కానీ మోసపోయానన్న విషయాన్ని గ్రహించలేకపోయారు భట్. తనతో పాటు మరెంత మంది అమాయకుల్ని ఈ విధంగా మోసం చేస్తున్నారో అని విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశాడు. పరిచయం లేని వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story