తాజా వార్తలు

ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను హతమార్చిన భార్య

ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను హతమార్చిన భార్య
X

pavani

మూడు ముళ్లు వేసిన భర్తని.. గుట్టుగా మట్టు బెట్టింది. ఇద్దరు ప్రియులతో కలిసి.. కట్టుకున్నవాడిని కడతేర్చింది. సొంతూరిలో చంపేస్తే.. తన బండారం ఎక్కడ బయటపడుతుందోనని చాలా తెలివిగా స్కెచ్‌ వేసింది. జిల్లా దాటించి ప్రాణం తీయించిన ఆ కిలాడీ నేర చరిత్ర ఐదు నెలల తర్వాత బయటపడింది.

ఒకడిని ప్రేమించి.. మరొకడి ఒత్తిళ్లకు తలొగ్గి.. తల్లినే హత్య చేసిన కీర్తి ఉదంతం మరిచిపోకముందే.. అలాంటి మరో ఘోరమైన నేరం మరొకటి బయటపడింది. నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్ గోదావరిలో జూన్ 9న కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని శవం కనిపించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అక్కడే అంత్యక్రియలు కూడా చేశారు. మృతుడి దగ్గర లభించిన ఆధారాలు, శవం ఫోటోలను చుట్టుపక్కల జిల్లాలకు పంపించారు పోలీసులు. మరోవైపు.. నిజామాబాద్ జిల్లా అంకాపూర్‌లో ఉదయకుమార్ అనే 40 ఏళ్ల వ్యక్తి అదృశ్యం అయ్యాడు. ఐదు నెలలు గడుస్తున్నా.. అతని గురించి వివరాలేమీ దొరకలేదు. కుటుంబ సభ్యులు ఆయన భార్య పావని అలియాస్ లావణ్యను ఎన్నిసార్లు అడిగినా తనకు తెలియదనే చెప్తోంది. ఒకరోజు మృతుడి కుటుంబ సభ్యులు పావని ఇంటికి వెళ్లగా.. దౌలాజీ అలియాస్ రమేష్‌తో కలిసి కనిపించింది. భర్త ఉదయ్‌ ఎటు వెళ్లాడో.. నన్నెందుకు అడుగుతున్నారంటూ ఆమె చిరాకు పడింది. రమేష్‌ కూడా ఆమెకు మద్దతుగా మాట్లాడాడు. ఉదయ్ సోదరి పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడు. మరోసారి ప్రశ్నిస్తే చంపేస్తామంటూ హెచ్చరించడంతో ఉదయ్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచీ వాళ్లిద్దరిపై పోలీసులు నిఘా పెట్టారు.

అటు.. నిర్మల్‌ జిల్లాలో.. అనుమానాస్పద కేసును ఛేదించాలని ఎస్పీ శశిధర్ రాజు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలు కోణాల్లో శోధన సాగించారు. అంకాపూర్‌లో ఐదు నెలల క్రితం అదృశ్యమైన ఉదయ్ కుమార్ విషయం వాళ్ల దృష్టికి వెళ్లింది. ఆయన భార్య లావణ్య మరొకరితో సన్నిహితంగా ఉంటోందని తెలియడంతో వాళ్లు కూడా ఫోకస్‌ పెంచారు. మామడ దగ్గర వాహన తనిఖీలో దౌలాజీతో కలిసి టూవీలర్‌పై వెళ్తుండగా పావనిని పట్టుకున్నారు. ఇద్దరిని విచారించగా ఉదయ్‌ కుమార్‌ను హత్య చేశామని ఒప్పుకున్నారు. నిజామాబాద్ జిల్లా చెంగల్‌కు చెందిన గంగాధర్ ప్రమేయం కూడా ఉన్నట్లు స్పష్టమైంది. ఇద్దరు ప్రియులతో పావని వివాహేతర సంబంధమే.. ఆమె భర్త ఉదయ్‌ కుమార్‌ హత్యకు కారణంగా నిర్ధారణ అయింది.

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని పావని పథకం వేసింది. దూరంగా తీసుకెళ్లి చంపేయండని ఇద్దరు ప్రియులకు చెప్పింది. మూడేళ్ల కూతురికి పుట్టు వెంట్రుకలు తీసేందుకు డబ్బులు అవసరమని.. దౌలాజీ, గంగాధర్ ఇస్తారని నమ్మించి వారితో భర్తను పంపించింది. దౌలాజీ, గంగాధర్ తో కలిసి పావని భర్త ఉదయ్‌ పొన్కల్ వెళ్లారు. ఫుల్ గా మద్యం తాగారు. హత్యకు కొన్ని నిమిషాల ముందు.. ప్రియులిద్దరూ పావనికి ఫోన్‌ చేశారు. చంపమంటావా అని మరోసారి అడిగారు. ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్న ఆ కిలాడి.. ఏమాత్రం ఆలోచించలేదు. చంపండని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. వాళ్లిద్దరూ ఉదయ్‌ను గోదావరిలో ముంచి ప్రాణాలు తీశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. ఏమీ తెలియనట్లు వెళ్లిపోయారు.

గంగాధర్ కొద్ది రోజుల క్రితం దుబాయి వెళ్లాడు. ఇక్కడే ఉన్న దౌలాజీతో పావని సహజీవనం చేస్తోంది. నిందితులు పావని, దౌలాజీలను అరెస్ట్ చేసిన పోలీసులు.. దుబాయి నుంచి గంగాధర్‌ను రప్పించే పనిలో ఉన్నారు.

Next Story

RELATED STORIES