ఐటీ కంపెనీల్లో భారీ ఉద్యోగాల కోత..

ఐటీ కంపెనీల్లో భారీ ఉద్యోగాల కోత..

it

కాగ్నిజెంట్‌ బాటలో దేశీ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సైతం ఉద్యోగాల్లో కోత విధించనుంది. దేశంలోనే రెండో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ వేల సంఖ్యలో తన ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్లు, మధ్య స్థాయి ర్యాంక్‌‌లు కలిగిన ఉద్యోగులను ఇన్ఫోసిస్ తీసేస్తున్నట్టు తెలిసింది. సీనియర్ మేనేజర్ల స్థాయి ర్యాంక్ కలిగిన జాబ్ లెవల్‌‌ 6లో 2,200 మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తెలిసింది. కంపెనీలో లెవల్ 6, 7, 8 బ్యాండ్స్‌‌లో కలిపి మొత్తంగా 30వేలకు పైగా ఉద్యోగులున్నారు. జాబ్ లెవల్ 3 లేదా దాని కంటే కింద 4, 5 లెవెల్ లో కంపెనీ 2 శాతం నుంచి 5 శాతం వర్క్‌‌ఫోర్స్‌‌ను తీసేస్తోంది. అంటే 4 వేల నుంచి 10 వేల మంది ఉద్యోగులను ఇన్ఫోసిస్ తీసేస్తున్నట్టు సమాచారం.

కంపెనీలో 86,558 మంది ఉద్యోగులు అసోసియేట్ స్థాయిలో ఉండగా.. లక్ష పదివేల మంది ఉద్యోగులు మిడిల్ విభాగంలో ఉన్నారు. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్‌‌ హోదాలు కలిగిన 971 మందిలో సుమారు 50 మందికి పింక్ స్లిప్‌‌లు ఇస్తున్నట్టు రిపోర్టు పేర్కొంది. ఉద్యోగుల కోత ప్రక్రియ వ్యాపారాల్లో సాధారణంగా జరిగే అంతర్గత ప్రక్రియేనని ఇన్ఫోసిస్ చెప్పింది.

అటు ఫ్రెంచ్‌‌ మల్టినేషనల్ టెక్ సర్వీసుల కంపెనీ క్యాప్‌‌జెమినీ కూడా ఇండియాలో సుమారు 500 మంది ఉద్యోగులను తీసేసింది. ప్రాజెక్ట్స్‌‌లో గ్రోత్ తక్కువగా ఉండటంతో ఉద్యోగులపై వేటు వేసింది. ఈ కంపెనీకి ఇండియాలో లక్ష మందికి పైగా ఉద్యోగులున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సగానికి పైగా ఇక్కడే ఉన్నారు. అటు కాగ్నిజెంట్ కూడా భారీగా ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 10వేల మందిని ఇంటికి పంపుతోంది.

ఐటీ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోతపై ఆందోళన నెలకొంది. పెరుగుతున్న వ్యయం, ముంచుకొస్తున్న మాంధ్యంతో పాటు.. తగ్గుతున్న కాంట్రాక్టుల కారణంగానే కోత విధిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆటోమేషన్‌ రాక కారణంగానూ.. ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే ధోరణి పెరిగిందని హెచ్‌ఆర్‌ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లేఆఫ్స్ ఇటీవల కాలంలో చోటు చేసుకోలేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అంతకుముందు పర్‌‌‌‌ఫార్మెన్స్ ఆధారంగా ఉద్యోగులను తీసేదని.. కానీ, ఇప్పుడు తీసేస్తోన్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ట్రెడిషినల్ సపోర్ట్ సర్వీసులను అందజేయడానికి ఆటోమేషన్‌‌ వల్ల తక్కువ మంది ఉద్యోగులు అవసరం పడుతున్నారని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story