కన్న కొడుకునే సజీవదహనం చేసిన తల్లిదండ్రులు

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దామెర మండలం ముస్తాలపల్లిలో కుటుంబ కలహాలతో తల్లిదండ్రులే కొడుకును సజీవదహనం చేశారు. నిత్యం మద్యం సేవించి వచ్చి గొడవపడుతున్న కొడుకుతో విసిగిపోయిన వృద్ద దంపతులు ఈ దారుణానికి పాల్పడ్డారు. కడారి మహేష్ చంద్ర అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. డబ్బుల కోసం భార్యను వేధిస్తున్నాడు. దీంతో బాధలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు వేములమ్మ, ప్రభాకర్ లతో కలిసి ఉంటున్నాడు. తనతీరుతో భార్య వెళ్లిపోయినా.. పద్దతి మార్చుకోలేదు. పైగా తల్లిదండ్రులతో నిత్యం డబ్బుల కోసం గొడవపడి వారిని వేధించేవాడు. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు.. మంగళవారం రాత్రి చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. సజీవదహనం చేశారు. కాలనీలో అందరూ చూస్తున్నా.. ఎవరూ అడ్డుకోలేదు. వ్యవసాయమార్కెట్లో గుమస్తాగా పనిచేసే మహేష్ తీరుతో తల్లిదండ్రులు విసిగిపోయారని.. భరించలేకే ఇలా చేశారని స్థానికులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com