తమిళనాడులో కలకలం రేపుతున్న పరువు హత్య

తమిళనాడులో పరువుహత్య కలకలం సృష్టిస్తోంది. ఓ దళితుడిని ప్రేమించిందని కన్నకూతురిపైనే కిరోసిన్ పోసి హత్య చేసింది ఓ మహాతల్లి. చివరకు తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నాపగట్టణం జిల్లా వాజ్మంగళం గ్రామంలో జరిగింది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన కన్నన్, ఉమామహేశ్వరి దంపతుల కుమార్తె జనని తన గ్రామంలోని ఓ దళిత యువకుడిని ప్రేమించింది. వచ్చే నెలలో 18 ఏళ్లు నిండాక జనని పెళ్లి చేసుకోవాలనుకుంది. విషయం తల్లి ఉమామహేశ్వరికి తెలియడంతో ఇద్దరూ పారిపోదామనుకున్నారు. దీనిపై తల్లి, కుమార్తెల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి జనని ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది.
కూతురు చనిపోయిందని నిర్ధారించుకున్నాక తాను కూడా కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం తల్లి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పరువు హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పరువు కోసం కన్నకూతురినే చంపిన ఘటనతో స్థానికులు షాకయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com