ప్రియాంక రెడ్డి హత్య కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు

ప్రియాంక రెడ్డి హత్య కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పలు కోణాల్లో దర్యాప్తు

priyankareddy

ప్రియాంక రెడ్డి హత్యకు ముందు ఎప్పుడు ఏం జరిగింది.. ఎక్కడెక్కడ ఆమె తిరిగింది. టోల్ ప్లాజాకు ఎన్నిగంటలకు చేరుకుంది. హత్య ఏ టైంలో జరిగింది.. స్కూటీ టైర్‌ పంక్చర్‌ అతికిస్తామంటూ నమ్మించి అత్యాచారం చేసి హత్య చేశారా? ప్రియాంక కేసులో ఇంకా వీడాల్సిన చిక్కులెన్నో ఉన్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకున్నారని చెబుతున్నా.. అధికారికంగా ఎలాంటి ప్రకటనా పోలీసుల నుంచి రాలేదు. లారీ డ్రైవర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానాలు మాత్రమే. ఘటన జరిగిన తీరు.. మృతదేహం లభించిన ప్రాంతం.. బైకు దొరికిన స్థలం ఆధారంగా స్థానికుల పనేనన్న అనుమానాలూ లేకపోలేదు.

మొత్తానికి పోలీసులు ఘటనలపై కీలక ఆధారాలు సంపాదించినట్టు తెలుస్తోంది. ఇద్దరు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే వీరు లారీ డ్రైవర్లు కాదని.. స్థానికులేనని తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రానికి కేసును ఛేదించాలని పోలీసులు పట్టుదలగా ఉన్నారు. సజ్జనార్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. శంషాబాద్ లోనే మకాం వేసి దర్యాప్తు చేస్తున్నారు.

బుధవారం కొల్లూరులో విధులు ముగించుకున్న ప్రియాంక.. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చింది. ముఖంపై ఏర్పడిన మచ్చలకు చికిత్స కోసం ఇంటి నుంచి స్కూటీపై సాయంత్రం 6 గంటలకు బయల్దేరింది. స్కూటీని తొండుపల్లి వద్ద ఉన్న టోల్‌ ప్లాజాకు కొద్ది దూరంలో ఆపి అక్కడి నుంచి మరో వాహనంలో గచ్చిబౌలిలోని ఓ క్లినిక్‌కు వెళ్లింది. తిరిగి రాత్రి 9 గంటల సమయంలో టోల్‌ప్లాజా వద్దకు చేరుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధపడింది. అయితే స్కూటీ పంక్చర్‌ అయినట్లు గుర్తించింది.

స్కూటీ పంక్చర్‌ అయ్యింది.. బాగుచేసుకొస్తానని ఓ వ్యక్తి తీసుకెళ్లాడు. పక్కన లారీలో ఎవరో ఉన్నారు. నాకు భయంగా ఉంది అంటూ ప్రియాంక తన చెల్లెలికి రాత్రి 9.22 గంటల సమయంలో ఫోన్‌ చేసి చెప్పింది. చుట్టూ లారీ డ్రైవర్లు ఉన్నారని.. వారిని చూస్తే భయమేస్తోందని.. అంతా తననే చూస్తున్నారంటూ ఆందోళనగా మాట్లాడింది. ఒంటరిగా ఉన్నానని.. కొద్దిసేపు మాట్లాడాలంటూ సోదరిని కోరింది. ఇలా సుమారు 6 నిమిషాల పాటు ప్రియాంక తన చెల్లెలితో ఫోన్‌లో సంభాషించింది. ఆ తర్వాత ప్రియాంక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయ్యింది.

స్కూటీ పంక్చర్‌ అతికించి ఇస్తామంటూ అక్కడే ఉన్న ఓ 20 ఏళ్ల గుర్తు తెలియని యువకుడు ప్రియాంక స్కూటీ తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత వచ్చి.. పంక్చర్‌ అతికించేవారు లేరని, మరో చోటుకు తీసుకెళ్తానని ప్రియాంకకు చెప్పాడు. అందుకు ఆమె అడ్డుచెబుతూ.. ముందుకు వెళ్లి తానే ఎక్కడైనా పంక్చర్‌ అతికించుకుంటానని చెప్పినా ఆ వ్యక్తి వినకుండా మధ్యలోనే స్కూటీ ఆగిపోతుందని చెప్పి పంక్చర్‌ అతికించేందుకు మరో చోటుకు తీసుకెళ్లాడు.

బుధవారం రాత్రి చెల్లెలితో మాట్లాడే సమయంలో ప్రియాంక ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిన తర్వాత రాత్రి 11 గంటలైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో 12గంటలకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ప్రియాంక అదృశ్యం కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం షాద్‌నగర్‌లో మహిళ హత్య జరిగిన సంఘటన వెలుగుచూడటంతో పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టని స్థితిలో ఉన్న ప్రియాంక మెడలో ఉన్న బంగారు లాకెట్‌ ఆధారంగా ఆమెను పోలీసులు గుర్తుపట్టారు.

ప్రియాంకను వేరే ప్రాంతంలో హత్య చేసి చటాన్‌పల్లి వద్దకు తీసుకొచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద ఉన్న లారీ డ్రైవర్లు ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారా.. ఆమె ప్రతిఘటించడంతోనే హత్య చేసి నిప్పంటించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం రాత్రి సుమారు 9.30 సమయంలో ప్రియాంకరెడ్డి సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ అయ్యింది. ఆ తర్వాతే ఆమెను దుండగులు కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే దుండగులు ప్రియాంకరెడ్డిని ఏడు గంటల పాటు తమ వద్ద ఉంచుకొని ఆ తర్వాత దారుణానికి ఒడిగటినట్లు తెలుస్తోంది. ప్రియాంకరెడ్డి కిడ్నాప్‌ అయిన ప్రాంతానికి, ఆమె మృతదేహం ఉన్న ప్రాంతానికి మధ్య సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రియాంకరెడ్డిని బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కిడ్నాప్‌ చేసిన దుండగులు గురువారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఎక్కడికి తీసుకెళ్లి ఉంటారన్నది తెలియాల్సి ఉంది.

ప్రియాంకరెడ్డి తరచూ గచ్చిబౌలికి వెళ్లి వచ్చే సమయంలో టోల్‌గేట్‌ బూత్‌ సమీపంలోనే స్కూటీ నిలిపేది. బుధవారం సాయంత్రం మాత్రం టోల్‌గేట్‌ సిబ్బంది అక్కడ స్కూటీ పెట్టొద్దనడంతో పక్కనే ఉన్న ఔటర్‌ సర్వీసు రోడ్డు సమీపంలో పెట్టి వెళ్లింది. రోజూ ఆమె కదలికలను గమనిస్తున్న వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారా.. లేదా లారీ డ్రైవర్లు పథకం ప్రకారమే ఇలా చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వీసు రహదారి వైపు సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎవరై ఉంటారనేది తెలియలేదు. ప్రియాంక అత్యాచారానికి గురైందని అనుమానిస్తున్న స్థలం టోల్‌ప్లాజాకు 60 మీటర్ల దూరంలో ఉంది. రాళ్లగూడ వైపు వెళ్లే సర్వీసు రహదారికి అరవై మీటర్ల దూరంలోనే ప్రహరీ ఉన్న అర ఎకరం స్థలంలోని ఈ ఘటన జరిగినట్లు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story