పని చేసిన అన్ని రంగాల స్థాయిని పెంచిన గొల్లపూడి.. ఇకలేరు..

పని చేసిన అన్ని రంగాల స్థాయిని పెంచిన గొల్లపూడి.. ఇకలేరు..

gollapudi

ప్రముఖ నటుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతిరావు కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి తెలుగు చిత్రసీమకు తీరనిలోటని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు భాషకు గొల్లపూడి చేసిన సేవలు మరువలేనివని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మృతిపట్ల సంతాపం ప్రకటించి ఆయన కుటుంబానికి తన ప్రగాడ సానుభూతిని తెలిపారు. సినీ ప‌రిశ్రమ మంచి వ్యక్తిని కోల్పోయిందని తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ అన్నారు. ఉత్తమ సమాజం కోసం తపించిన గొప్ప వ్యక్తి గొల్లపూడి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గొల్లపూడి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.

గొల్లపూడి మారుతీరావు మృతిపై.. టాలీవుడ్‌ సీనియర్ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మారుతీరావుది, తనది గురుశిష్యులాంటి బంధం అన్నారు మెగాస్టార్ చిరంజీవి. డైలాగులు ఎలా పలకాలో మారుతీరావు దగ్గర నేర్చుకున్నట్లు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన గొల్లపూడి లాంటి వ్యక్తి లేకపోవడం సినీ పరిశ్రమకు, సమాజానికి తీరని లోటని సినీ ప్రముఖలు అభిప్రాయపడ్డారు.

1939 ఏప్రిల్ 14న విజయనగరం జిల్లా తెర్లాం మండలం నందబలగ గ్రామంలో గొల్లపూడి జన్మించారు. సుబ్బారావు, అన్నపూర్ణమ్మ దంపతుల సంతానంలో మొదటి సంతానం మారుతీరావు. విశాఖలో ఆయన విద్యాభ్యాసం సాగింది. 1959లో ఆంధ్రప్రభ ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1961 నవంబరు 11న శివకామసుందరితో హనుమకొండలో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులున్నారు.

తెలుగు వాళ్లు అందరికీ సుపరిచితులయిన గొల్లపూడి సుప్రసిద్ద రచయిత, సంపాదకుడిగా తన ప్రయాణం మొదలు పెట్టి మాటల రచయితగా సినీ రంగంపైనా, వ్యాఖ్యాతగా బుల్లి తెరపైనా తనదైన ముద్రవేశారు. సుమారు 290కిపైగా చిత్రాల్లో నటించారు. ప్రేమ పుస్తకం చిత్రానికి దర్శకత్వం వహిస్తూ గొల్లపూడి చిన్నకుమారుడు శ్రీనివాస్ చనిపోయారు. అతని జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. తండ్రిబాటలోనే రచనపై ఆసక్తి పెంచుకున్న గొల్లపూడి పెద్దకుమారుడు సుబ్బారావు, రెండో కుమారుడు రామకృష్ణ ఆ రంగంలో రాణించారు. గొల్లపూడికి ఐదుగురు మనవరాళ్లు, ఒక మనవడు ఉన్నారు.

మారుతీరావుకి విశాఖకి మంచి అనుబంధం ఉంది. మద్దిలపాలెంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండేవారు. గతం కొంత కాలంగా ఆయన తన కుమారుడి వద్దకు వెళ్లిపోయారని అపార్ట్‌ మెంట్ వాసులు అన్నారు. ఆయన మరణవార్త విని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

గొల్లపూడి నటించిన తొలి చిత్రం 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఇక ఆయన చివరి చిత్రం జోడీ. 42 ఏళ్ల వయస్సులో మొదటి సినిమాలో నటించిన మారుతీరావు. మూడున్నర దశాబ్దాలకుపైగా సినీరంగంలో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా మెప్పించారు. గొల్లపూడికి గద్దముక్కు పంతులు అని దర్శకుడు కోడిరామకృష్ణ పేరు పెట్టారు. ఇక సుందరకాడ చిత్రంలో సింగిల్ పూరీ శర్మ క్యారెక్టర్ విపరీతంగా ఫేమస్ అయ్యింది.

1963లో 13 ఏళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా రేడియోలో గొల్లపూడి పనిచేశారు. దాశరథి ప్రోత్సహంతో సినీ రచయితగా మారి.. దేవులపల్లి కృష్ణశాస్త్రితో కలిసి రచనలు చేశారు. 14 ఏళ్ల వయస్సులోనే ఆశాజీవి అనే కథను కూడా రాశారు. డాక్టర్ చక్రవర్తికి తొలి సినిమా రచనాసహకారం అందించారు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఆత్మగౌరవానికి రచయితగా పనిచేశారు. ఒక టైమ్‌లో ఏడాదికి 31 సినిమాలు చేశారంటే ఎంత బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారో అర్థం చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 6 నంది పురస్కారాలను గొల్లపూడి అందుకున్నారు. ఆత్మగౌరవం చిత్రానినికి ఉత్తమ కథగా నంది పురస్కారం వరించింది. రంగిణి చిత్రంలో ఉత్తమ హాస్యనటుడిగా నంది అందుకున్నారు. రామాయణంలో భాగవతం చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డ్ వరించింది. దాదాపు 12 నవలలు, 4 కథా సంపుటాలు, 3 పిల్లల కథలు ఆయన రాసారు. జీవన కాలమ్ పేరుతో అనేక వ్యాసాలు కూడా రాసారు. విద్యార్థి దశలోనే రంగస్థలంపై ఎన్నో నాటకాల్లో నటించిన గొల్లపూడి రాఘవ కళానికేతన్ పేరుతో నాటక బృందానికి నాయకత్వం కూడా వహించారు.

గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఈనెల 15న చెన్నైలో జరపనున్నట్లు ఆయన చిన్న కుమారుడు రామకృష్ణ తెలిపారు. తండ్రి భౌతికకాయాన్ని శనివారం ఉదయం ఆస్పత్రి నుంచి స్వగ్రృహానికి తీసుకువచ్చి ఆదివారం వరకు బంధుమిత్రులు, అభిమానుల సందర్శనార్థం ఉంచుతామని చెప్పారు. జర్మనీలో ఉంటున్న కుమారుడు సుబ్బారావు పెద్ద కుమార్తె , మారుతీరావు రెండో కుమారుడు రావాల్సి ఉన్నందున అంత్యక్రియలు ఆదివారం నిర్వహించేందుకు నిర్ణయించారు.

Tags

Read MoreRead Less
Next Story