తాజా వార్తలు

టీఆర్ఎస్ ఏడాది పాలనా తీరుపై మండిపడుతున్న విపక్షాలు

టీఆర్ఎస్ ఏడాది పాలనా తీరుపై మండిపడుతున్న విపక్షాలు
X

kcr

టీఆర్ఎస్ ఏడాది పాలనపై మండిపడ్డాయి ప్రతిపక్షాలు. అప్పులు, ఆత్మహత్యలు, అత్యాచారాలు భయాందోళనలే తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదని కేసీఆర్ ప్రభుత్వానికి ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇచ్చాయి. అధికార పార్టీ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని విమర్శించాయి. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్ పాలనలో సంక్షేమం కుంటుబడిపోయిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాదిలో కేసీఆర్ ప్రభుత్వం పని తీరు ఎలా ఉందో ప్రొగ్రెస్ కార్డులతో సిద్ధమైపోయాయి ప్రతిపక్షాలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పటి వరకు అమలు చేసిన హామీలు ఏమిటో చెబుతూ అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు లక్ష్మణ్‌.

దళితులను సీఎం చేస్తానని గతంలో మాటించిన సీఎం.. కనీసం దళితులకు ఇచ్చిన మూడెకరాల భూమి హామీని కూడా నిలబెట్టుకోవటం లేదని కాంగ్రెస్ నేత భట్టీ విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైందని విమర్శించారు.

ఆర్థికలోటు చూసిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడంలేదన్నారు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పాకెట్ బుక్‌ తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. ఎక్సైజ్ విధానంపై సోమవారం వర్క్‌షాప్‌ నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీ ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరించాలన్నారు కోదండరామ్‌.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పాలన తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హింస, శాంతి భద్రతల విఘాతంలో 2వ స్థానం, అవినీతిలో రాష్ట్రం అయిదో స్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇక ధరల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని అన్నారు. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు, ఆర్టీసీ ఉద్యోగుల మరణాలు ప్రభుత్వ పాపాలేనని ఉత్తమ్ ఆరోపించారు.

Next Story

RELATED STORIES