తాజా వార్తలు

తొందరపాటు అవసరం లేదు.. నాణ్యత పాటించాలి: కేసీఆర్

తొందరపాటు అవసరం లేదు.. నాణ్యత పాటించాలి: కేసీఆర్
X

kcr

యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులను మరోసారి సీఎం కేసీఆర్ పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ఆరున్నర గంటలు క్షేత్ర పరిశీలన చేశారాయన. మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్.. తొలుత లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వచనం స్వీకరించారు. తరువాత రెండు గంటల పాటు ప్రధాన ఆలయ నిర్మాణ ప్రాంతంలో కలియ తిరిగారు. ఆలయ గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్థంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం వంటశాల, పుష్కరిణి, యాగశాల తదితర నిర్మాణాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించారు.

యాదాద్రి ప్రధాన ఆలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మిక, ధార్మికత ఉట్టిపడేలా వున్నాయని కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణ పనులు డెడ్‌లైన్ పెట్టుకుని చేసేవి కావన్నారు. శాశ్వతంగా ఉండాల్సిన నిర్మాణాలు కాబట్టి ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గర్భగుడి ఆకారం, ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా ఉండాలన్నారు కేసీఆర్. తొందరపాటు అవసరం లేదన్నారు. జాగ్రత్త, నాణ్యతా పాటించాలని సూచించారు. నిర్మాణాలు పటిష్టంగా వుండాలని స్పష్టంచేశారు.

యాదాద్రి లక్ష్మి నరసింహుడి భక్తులు దేశవిదేశాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. రాబోయే కాలంలో లక్షలాదిగా స్వామి దర్శనానికి తరలి వస్తారని అంచనా వేశారు. వాళ్లకు దైవ దర్శనంలో, వసతి సౌకర్యాల్లో, పుణ్య స్నానాల విషయంలో, తల నీలాల సమర్పణలో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే లక్ష్యం కావాలని కేసీఆర్ సూచించారు. రాతి శిలలను అద్భుత కళాఖండాలుగా మలిచారంటూ శిల్పులను అభినందించారాయన. ఆలయ ప్రాంగణమంతా దేవతల విగ్రహాలతో నిండేలా రూపకల్పన చేశారని అన్నారు. 560 మంది శిల్పులు నాలుగేళ్లుగా పడుతున్న కష్టం ఫలించి అద్భుత ఆకారాలతో కూడిన ప్రాకారాలు సిద్ధమయ్యాయని అన్నారు. వందకు వంద శాతం శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని తీర్చిదిద్ధడం యాదాద్రిలోనే సాధ్యమైందని సీఎం అభిప్రాయపడ్డారు.

ఇక, ఆలయ ప్రాంగణంలో పచ్చదనం పెంచేలా, ఆహ్లాదం పంచేలా ఉద్యానవనాలు ఉండాలన్నారు సీఎం కేసీఆర్. యాదాద్రి ప్రాశస్త్యం, లక్ష్మీ నర్సింహస్వామి చరిత్ర, స్థలపురాణం ప్రస్పుటించేలా తైల వర్ణ చిత్రాలను ఆలయ ప్రాంగణంలో వేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతరం రింగురోడ్డు పనులను.. సకల సౌకర్యాలతో కూడిన 15 వీవీఐపీ కాటేజీలతో నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్‌ను పరిశీలించారు. కొన్ని మార్పులను సూచించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వారు వచ్చినప్పటికీ ఇబ్బందులు ఉండకూడదన్నారు. బస్వాపురం రిజర్వాయర్ తరహాలో ప్రెసిడెన్షియల్ సూట్ సమీపంలోని మైలార్ గూడెం చెరువును సుందరీకరించాలని సూచించారు. ప్రధాన దేవాలయం వుండే గుట్ట నుండి రింగురోడ్డు మధ్య భాగంలో గతంలో అనుకున్న ప్రకారమే అన్ని నిర్మాణాలు సాగాలన్నారు కేసీఆర్. కోనేరు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

Next Story

RELATED STORIES