విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు

విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అనుమానాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు

vsp

కొద్దిరోజుల క్రితం విశాఖ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్‌ వివిధ శాఖల అధికారులతో రివ్యూ చేశారు. మెట్రో రైల్‌, నగరంలో రవాణా, తాగునీరు, రహదారులు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పటిష్టం చేయడం, కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యాటక ప్రాజెక్టులు ఇలా అనేక అంశాలపై సమీక్ష నిర్వహించారు. అయితే, అప్పట్లో ఈ సమీక్ష అంత ప్రత్యేకంగా కనిపించలేదు. కానీ, రాజధాని తరలింపు అంశం తెరమీదకు రావడం, విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ చేయాలనే ఆలోచనను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగనే చెప్పడంతో అప్పట్నుంచి సాగర నగరంపై చర్చోప చర్చలు నడుస్తున్నాయి. రాజధానిని తరలిస్తారనే ప్రచారం అమరావతి ప్రాంత ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంటే.. విశాఖ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజా నిర్ణయాలతో ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రచారానికి బలం చేకూరినట్లైంది.

ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖను ప్రకటించబోతున్న నేపథ్యంలో నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 394.50 కోట్ల విలువైన అభివృద్ధి పనుల కోసం పాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణం కోసం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. కేవలం ఉత్తర్వులే కాదు నిధులు కూడా విడుదల చేసింది. నిధుల విడుదలకు సంబంధించి వేర్వేరుగా 7 జీవోలను జారీ చేసింది.

కాపులుప్పాడ సమీపంలో బయోమైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం 22.5 కోట్లు, కైలాసగిరి ప్లానిటోరియం కోసం 37 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. అలాగే సిరిపురం జంక్షన్‌లో మల్టీలెవెల్ కార్‌ పార్కింగ్, వాణిజ్య సముదాయం కోసం 80 కోట్లు, నేచురల్‌ హిస్టరీ పార్క్‌, మ్యూజియం రీసెర్చ్‌ సంస్థ కోసం 88 కోట్లు కేటాయించింది. నాతయ్యపాలెం జంక్షన్‌ సమీపంలోని చుక్కవానిపాలెంలో రహదారి నిర్మాణం కోసం 90 కోట్లు, సమీకృత మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్‌, బీచ్‌రోడ్డులో భూగర్భ పార్కింగ్ కోసం 40 కోట్లు, ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్‌ నిర్మాణం కోసం 75 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

విశాఖ అభివృద్ధిపై సమీక్షలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు శనివారం విశాఖపట్నంలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. 1290 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ ఆర్థిక బడ్జెట్‌లో రాజధాని అమరావతికి 500 కోట్లు మాత్రమే కేటాయించిన జగన్ సర్కార్.. ఇప్పుడు విశాఖ రాజధాని అని అధికారిక ప్రకటన వెలువడక ముందే ఈ స్థాయిలో నిధులను కేటాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి రైతుల ఆవేదనను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం.. విశాఖ విషయంలో ఇలా వ్యవహరించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో పాటు విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందనే విషయాన్ని ఆధారాలతో సహా రుజువు చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడుతున్న విజయసాయిరెడ్డి.. సీబీఐ విచారణకు సిద్ధమవుతారా అంటూ.. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సవాల్‌ విసిరారు. కేబినెట్‌ మీటింగ్‌ కంటే ముందే విజయసాయి విశాఖపై ఎందుకు అత్యుత్సాహం చూపుతున్నారని ప్రశ్నించారు.

తనకు విశాఖలో త్రీ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌ తప్ప మరే లేదన్న విజయసాయి.. టీడీపీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అశీల్‌మెట్ట మీద క్రిస్టియన్‌ మిషనరీ సంస్థ భూమిని ఢిల్లీలో అనిల్‌కుమార్‌తో కలిసి ఫైనలైజ్‌ చేయలేదా అంటూ నిలదీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story