సీఎం జగన్‌పై చక్రపాణి మహారాజ్ ఫిర్యాదు

సీఎం జగన్‌పై చక్రపాణి మహారాజ్ ఫిర్యాదు

maharaj

జగన్‌ ప్రభుత్వంపై కేంద్రానికి హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది. అమిత్‌షాతో హిందూ మహాసభ ఛైర్మన్ చక్రపాణి మహారాజ్‌ సమావేశమయ్యారు. ఏపీ రాజధాని తరలింపు, మత మార్పిడుల, మైనింగ్ మాఫియాపై ఫిర్యాదు చేశారు. ప్రధాన మంత్రి మోదీ, అమిత్‌షా పేరుతో రాసిన లేఖను అందించిన చక్రపాణి మహారాజ్.. రాష్ట్ర విభజనతో ఏపీ తీవ్రంగా నష్ట పోయిందని అన్నారు. అమరావతిని అప్పటి ప్రభుత్వం రాజధానిగా ఎంపిక చేసిందని.. ప్రధాని స్వయంగా రాజధానికి శంకుస్థాపన చేశారని లేఖలో ప్రస్తావించారు చక్రపాణి మహారాజ్. రాజధాని అభివృద్ధికి కేంద్రం నిధులు సైతం మంజూరు చేసిందని గుర్తుచేశారు. అమరావతిని స్మార్ట్‌ సిటీగా కూడా ఎంపిక చేశారని తెలిపారు. హిందూ సంస్కృతికి ప్రతీకగా అమరావతి పేరు గాంచిందని చెప్పారు. చంద్రబాబు వైసీపీ ట్రాప్‌లో పడుతున్నారని.. మోదీ గతంలోనే చెప్పారని.. ఈరోజు అదే నిజం అవుతోందని అన్నారు. జగన్ ప్రభుత్వ వ్యక్తిగత విద్వేషాల కారణంగా అమరావతి ఇబ్బందుల పాలవుతోందని చెప్పారు. హిందుత్వంపై జరుగుతున్న దాడిగా దీన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు చక్రపాణి మహారాజ్. అమరావతిని రాజధాని కాకుండా చేయడం హిందూ సంస్కృతి, అమాయక రైతులపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో వెంటనే జోక్యం చేసుకొని, అమరావతి ఏపీ కేపిటల్‌గా ఉండేలా చర్యలు తీసుకోవాలి కోరారు చక్రపాణి మహారాజ్.

గత ఆరు నెలల్లో ఏపీలో మతమార్పిడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు చక్రపాణి మహారాజ్. దాదాపు 50వేల మతమార్పిడులు జరిగాయన్నారు. ప్రజాప్రతినిధులు మతమార్పిడులకు బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. జెరూసలెం యాత్రికులకు 60వేల సాయం, పాస్టర్లకు 5వేల జీతం ప్రకటించినప్పటి నుంచి మతమార్పిడులు మరింత పెరిగాయని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖ కమిషనరేట్ పరిధిలో చర్చిలకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని లేఖలో ప్రస్తావించారు చక్రపాణి మహారాజ్. ఇలాంటి సానుకూల చర్యల కారణంగా గత ఆరు నెలల్లో ఏపీలో మూడు వేల కొత్త చర్చిలు ఏర్పాటు అయ్యాయని ఆరోపించారు. అమరావతిలో మతమార్పిడులు సాధ్యం కావనే.. విశాఖను వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌గా ఎంచుకుందని అన్నారు చక్రపాణి మహారాజ్.

రాష్ట్రంలో హిందువుల ఆధ్వర్యంలో ఉన్న మైనింగ్‌ సంస్థలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని ఆరోపించారు చక్రపాణి మహారాజ్. క్రిస్టియన్ మైనింగ్ మాఫియా ఇప్పటికే రాష్ట్రంలోని మైనింగ్ సంస్థలను స్వాధీనం చేసుకుంటోందని ఆరోపించారు. ఒప్పుకోని మైనింగ్ సంస్థల యజమానులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఇప్పుడు విశాఖలోని హైగ్రేడ్ టైటానియంపై మైనింగ్ మాఫియా కన్నుపడిందని లేఖలో ప్రస్తావించారు. అనధికారంగా మైనింగ్ చేస్తూ పెద్ద ఎత్తున ట్యాక్సులు ఎగ్గొడుతున్నారని.. ఈ తతంగంపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి డిమాండ్ చేశారు చక్రపాణి మహారాజ్. సిట్టింగ్ హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ సుప్రీం జడ్జితోనూ విచారణ చేపట్టాలని అన్నారు.

ఏపీ ఆర్థిక నేరగాళ్ల చేతుల్లో నలిగిపోతోందని చక్రపాణి మహారాజ్ విమర్శించారు. 12కుపైగా సీబీఐ కేసులు, ఈడీ అటాచ్‌మెంట్‌లు ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సుపరిపాలన ఎలా అందిస్తారని ప్రశ్నించారు. లిక్కర్, ఇసుక మాఫియాతో రాష్ట్రంలో ప్రతి నెలా 3వేల కోట్ల అవినీతి జరుగుతోందని.. ఆ డబ్బంతా డైరెక్ట్‌గా వైసీపీ అధినేత జేబుల్లోకే వెళ్తోందిని ఆరోపించారు. వైసీపీ పాలన సొసైటీకి సంస్కృతి పరంగా, సంప్రదాయ పరంగా, ఆర్థికంగా నష్టం చేకూరుస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని జగన్ బెయిల్ రద్దు చేసి విచారణ ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఏపీ భవిష్యత్‌కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు చక్రపాణి మహారాజ్.

Tags

Read MoreRead Less
Next Story