ఆంధ్రప్రదేశ్

రాజధాని ప్రాంత నేతలతో సీఎం భేటీలో కీలక అంశాలపై చర్చ

రాజధాని ప్రాంత నేతలతో సీఎం భేటీలో కీలక అంశాలపై చర్చ
X

ambati

మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, ఆర్కే, మస్త్ఫా, శ్రీదేవి, నంబూరి శంకరరావు, అంబటి రాంబాబు, మల్లాది విష్ణు, పార్థసారధితోపాటు మరికొందరు ముఖ్య నేతలు పాల్గొన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళన, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలు, రైతులకు భరోసా ఇవ్వడం వంటి అనేక అంశాల గురించి చర్చించారు. రాజధాని తరలింపుపై రైతుల ఆందోళన, కనిపించడం లేదంటూ కొంతమంది ఎమ్మెల్యేలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

రాజధాని తరలింపుపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని.. ఆగ్రహంతో ఉన్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ ఫిర్యాదులు చేయడాన్ని వారు సమావేశంలో ప్రస్తావించారు. అయితే రాజధాని ప్రాంత రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలన్న అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఎమ్మెల్యేలకు నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. ఈ భేటీతో సచివాలయాన్ని విశాఖకు తరలించడం తప్పదనే సంకేతాలను ముఖ్యమంత్రి ఇచ్చినట్లు తెలుస్తోంది.

అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు అన్నారు. అమరావతి మాదిరిగా గ్రాఫిక్స్‌ అభివృద్ధి కాకుండా వాస్తవ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గత ఐదేళ్లలో రాజధాని కోసం చంద్రబాబు 5వేల కోట్లు ఖర్చు పెట్టారని.. అయినప్పటికీ ఒక్క శాశ్వత భవనం నిర్మించలేకపోయారని విమర్శించారు.

మరోవైపు అమరావతిలో 50 శాతం నిర్మాణాలు దాటిన భవనాలను పూర్తిచేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రైతులకు ఎలాంటి భయాందోళన అక్కర్లేదన్నారు. అమరావతిలో రైతుల నుంచి సేకరించిన 33వేల ఎకరాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

అంతేకాదు, మూడు ప్రాంతాల్లో రాజధానికి ఎంత ఖర్చవుతుందో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు.

Next Story

RELATED STORIES