రాయలసీమకు హైకోర్టు ఇస్తే గొప్పేముంది?: చంద్రబాబు

రాజధాని అమరావతి కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. రాజధాని కోసం జోలెపట్టి విరాళాలు సేకరిస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. చెక్‌పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై అమరావతి కోసం జోలి పట్టి భిక్షాటన చేశారు. అక్కడ నుంచి పెనుకొండకు చేరుకున్న టీడీపీ అధినేత.. బహిరంగ సభలో ప్రసంగించారు. మూడు రాజధానులు ప్రతిపాదించిన ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్‌ను జగన్ మూడు ముక్కల పేకాటల ఆడుకుంటున్నారని మండిపడ్డారు చంద్రబాబు. ప్రజలంతా ఒకదారిలో నడుస్తుంటే.. జగన్ మాత్రం ఉన్మాదిలా మరోదారిలో నడుస్తున్నారని విమర్శించారు. జగన్ పాలన తుగ్లక్ పాలనను మరిపిస్తుందన్నారు.
రాజధాని అమరావతి కోసం ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. రాయసీమకు కోర్టు ఇస్తున్నామని మాట్లాడుతున్నారని.. కోర్టు ఇస్తే గొప్పేముందని ప్రశ్నించారు. ఈ సంక్రాంతి అమరావతి సంక్రాంతిగా జరుపుకోవాలన్నారు టీడీపీ అధినేత.
ఏ దేశంలో లేని మూడు రాజధానులు.. ఏపీ అవసరమా అని ప్రశ్నించారు చంద్రబాబు. నీళ్లు, వ్యవసాయం, పరిశ్రమలు ఉంటే అభివృద్ధి జరుగుతుంది తప్ప.. రాజధాని కార్యాలయాలతో జరగదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com