ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్

election

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో రిజర్వేషన్లు 60 శాతానికి చేరడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన సుప్రీం కోర్టు.. నాలుగు వారాల్లో దీనిపై విచారణ పూర్తి చేయాలని ఆదేశిస్తూ.. ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది.

రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీం కోర్టు ఉత్వర్వులను పాటించలేదని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని.. కర్నూల్‌ జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి, అనంత జిల్లాకు చెందిన బీసీ రామాంజనేయులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో.. పిటిషనర్లు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 59.85 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిందని.. పిటిషన్‌లో ప్రస్తావించారు.

రిజర్వేషన్లకు సంబంధించి జారీ చేసిన జీవో 176ను రద్దు చేయాలని, ఏపీ పంచాయితీరాజ్‌ చట్టంలో చేర్చిన 9, 15, 152, 153,180, 181 సెక్షన్లు రాజ్యాంగ విరుద్ధమని, వాటిని కొట్టేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. ఈ పిటిషన్లలో రాష్ట్ర పంచాయితీరాజ్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి, కమిషనర్‌, డైరెక్టర్‌, అనంతపురం జిల్లా కలెక్టర్‌, జిల్లా పంచాయితీ అధికారిని పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు.

సుప్రీం కోర్టు స్టే విధించడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడ్డట్టయింది. శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.

Tags

Read MoreRead Less
Next Story