ఏపీ, తెలంగాణ సీఎస్‌ల భేటీ.. విభజన సమస్యలపై చర్చ

ఏపీ, తెలంగాణ సీఎస్‌ల భేటీ.. విభజన సమస్యలపై చర్చ

CS

గురువారం ఏపీ, తెలంగాణ సీఎస్‌లు భేటీ కానున్నారు. షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల ఆస్తుల విభజనపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నారు. తెలంగాణ, ఏపీ సీఎంల భేటీకి కొనసాగింపుగా సీఎస్‌ల సమావేశం కానున్నారు. ఆస్తుల విభజన విషయంలో సీఎంల సమావేశంలో చర్చించిన అంశాలపై.. సీఎస్‌ల భేటీలో మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. వెలగపూడి సచివాలయంలో జరిగే ఈ భేటీకి.. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు అందించే విషయంపై చర్చలు జరగనున్నాయి. అలాగే 9, 10 షెడ్యూల్‌లోని అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, విద్యుత్ ఉద్యోగుల విభజన, ఏపీ పౌర సరఫరాల శాఖకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన క్యాష్ క్రెడిట్, పోలీసు ఉద్యోగుల ప్రమోషన్లు, ఉద్యోగుల అంతర్‌రాష్ట్ర బదిలీలు, తదితర అంశాలపై డిస్కస్‌ చేయనున్నారు. ఈ భేటీ అనంతరం ఏపీ అధికారుల బృందం కూడా హైదరాబాద్‌లో తెలంగాణ అధికారులతో చర్చించనుంది.

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ అధికారులు ఏపీకి వచ్చి.. రెండు రాష్ట్రాల మధ్య సమస్యపై చర్చించటం ఇదే తొలి సారి. ఈ సమావేశంలో ప్రధానంగా 9, 10 షెడ్యూల్ సంస్థల పైన ఇప్పటికే షీలా బీడీ కమిటీ ఇచ్చిన నివేదిక, సిఫార్సుల పైన అధ్యయనం చేసి.. పరిష్కారం కాని వాటి పైన తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రులకు నివేదించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story