సభలోకి మంత్రులు తాగి వచ్చారు: యనమల రామకృష్ణుడు

సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్లాక ఆర్డినెన్స్ ఇవ్వడం అసాధ్యమన్నారు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు. సుప్రీం కోర్టు నిబంధనలకు ఇది విరుద్ధమని స్పష్టం చేశారు. బుధవారం మేం అడిగిన సెలెక్ట్ కమిటీ మండలికి సంబంధించి మాత్రమే అన్నారు. మేం జాయింట్ సెలెక్ట్ కమిటీ అడగలేదని గుర్తు చేశారు. ఒకవేళ జాయింట్ సెలెక్ట్ కమిటీ అడిగి ఉంటే.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందులో సభ్యులుగా ఉంటారని తెలిపారు. తాను సెలెక్ట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా చేశానని.. అన్ని ప్రాంతాల్లో పర్యటించి అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి సెలెక్ట్ కమిటీకి తగినంత సమయం అవసరం అన్నారు. ఈ ప్రక్రియ ముగియడానికి 3 నెలల కన్నా ఎక్కువే పట్టొచ్చని.. దీని అర్థం 3 నెలల్లోపు టైమ్ ఇవ్వమని కాదన్నారు యనమల. మండలి రద్దుకు మేం ఎప్పుడూ బాధపడం, భయపడబోమని స్పష్టంచేశారు. బుధవారం సభలోకి మంత్రులు తాగి వచ్చారని.. లోకేశ్‌ను కొట్టే ప్రయత్నం చేశారని యనమల ఆరోపించారు. సభలో ఎప్పుడూ చూడని పరిణామాలను మంత్రులు ప్రదర్శించారని యనమల మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com