ప్రతిసారి బిల్లులు అడ్డుకుంటున్నామంటున్నారు.. 38 బిల్లులు ఎలా పాస్ అయ్యాయి?: టీడీపీ

ప్రతిసారి బిల్లులు అడ్డుకుంటున్నామంటున్నారు.. 38 బిల్లులు ఎలా పాస్ అయ్యాయి?: టీడీపీ

ఏపీ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం ఆమోదించడాన్ని తప్పుబట్టారు టీడీపీ ఎమ్మెల్సీలు. శాసనమండలి ఖర్చు 60 కోట్లు వృధా అవుతుందన్న విషయం సీఎం జగన్‌కు అధికారంలోకి వచ్చినప్పుడు గుర్తులేదా? అని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం ఆమోదించినంత మాత్రాన.. మండలి రద్దు కాదన్నారు టీడీపీ ఎమ్మెల్సీలు.

ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అంశంలో ప్రజల అభిప్రాయాలు తీసుకునేందుకు బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తే.. శాసన మండలిని రద్దు చేస్తారా అని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీలు. వైసీపీ నుంచి ఇద్దరిని మంత్రులను చేసినప్పుడు మండలి రద్దు అనేది గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ప్రతిసారి బిల్లులు అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారని.. ఈ ఏడు నెలల్లో 38 బిల్లులను పాస్ చేశామని టీడీపీ ఎమ్మెల్సీలు గుర్తు చేశారు.

మండలి రద్దుపై సీఏం జగన్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీలు విమర్శించారు. శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగ్ పెట్టినప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు 18 మంది గైర్హజరయ్యారని.. అంటే జగన్ నిర్ణయానికి వారు ఏకీభవించనట్టేనా? అని ప్రశ్నించారు. ఏపీ అసెంబ్లీ తీర్మానం ఆమోదించినంత మాత్రాన.. మండలి రద్దు కాదన్నారు టీడీపీ ఎమ్మెల్సీలు. శాసన మండలిలో మంత్రులు దుర్మార్గంగా వ్యవహరించారని.. ఛైర్మన్‌ను తీవ్ర ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.

మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని నిర్ణయాలు చట్ట ప్రకారమే జరుగుతాయన్నారు టీడీపీ ఎమ్మెల్సీలు. రాజ్యంగ ఉల్లంఘన జరిగిందంటూ విమర్శించే మంత్రులు.. ముందుగా చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల కోసం తాము ఎలాంటి త్యాగనికైనా సిద్ధమేనన్నారు.

Tags

Read MoreRead Less
Next Story