బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు

బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల తగ్గింపు అంశం ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. ఎన్నికల నిర్వహణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లోగా ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు. నెలాఖరులోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం నియంత్రించాలనే ఆర్డినెన్స్‌ తెచ్చామని చెప్పారు.

డబ్బు, మద్యం పంపినట్లు రుజువు అయితే ఎన్నికల తర్వాత కూడా అనర్హత వేటు, మూడేళ్ల జైలు శిక్ష విధించాలన్నారు. స్థానిక ఎన్నికల నిర్వాహణ దేశానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన నిరోధానికి ప్రత్యేక యాప్‌ రూపొందించి.. ఏం జరిగినా ఇందులో నమోదయ్యేలా గ్రామ, వార్డు వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎం అధికారులకు చెప్పారు.

33ఏళ్ల పాటు ఉన్న రిజర్వేషన్లను సీఎం జగన్ కాపాడలేకపోయారని.. బీసీలపై కక్షతోనే ఇలా చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కేసులు వాదించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో న్యాయవాది ముకుల్‌ రోహత్గీని తీసుకొచ్చారని..అదే బీసీ రిజర్వేషన్ల కేసు విషయంలో మాత్రం శీతకన్ను వేస్తున్నారని మండిపడ్డారుమండలి రద్దు కోసం ఢిల్లీ వెళ్లిమోదీ, అమిత్‌షాను కలిసి లాబీయింగ్‌ చేసిన జగన్..రిజర్వేషన్లు కాపాడటంపై ఎందుకు శ్రద్ధ పెట్టలేదని నిలదీశారు చంద్రబాబు.

బీసీలకు తీరని అన్యాయం జరుగుతుంటే సీఎం జగన్ సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు టీడీపీ నేతలు.. 14 వేల కోట్ల బీసీ నిధులను ఇతర పథకాలకు మళ్లించారని ఆరోపించారు..రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు వేసిన బీసీ రామాంజనేయులు, బిర్రు ప్రతాపరెడ్డి వైసీపీకి చెందిన వాళ్లు కాదా అని నిలదీశారు.

అటు ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి.. అనంతపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు.. విగ్రహం చుట్టూ తిరుగుతూ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. అటు తిరుపతిలోనూ బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. రిజర్వేషన్ల తగ్గింపు ప్రభుత్వ వైఫల్యమేనంటూ మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story