Top

జగన్‌ అసమర్థత వల్లే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయి: చంద్రబాబు

జగన్‌ అసమర్థత వల్లే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయి: చంద్రబాబు
X

సీఎం జగన్‌ అసమర్థత వల్లే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. 33ఏళ్ల పాటు ఉన్న రిజర్వేషన్లను కాపాడలేకపోయారని.. బీసీలపై కక్షతోనే ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాల్సిన అవసరముందని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచే సమర్థమైన నేతలు రావాలనే ఉద్దేశంతో 1987 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్‌ కల్పించామని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్ల పెంపుతో అనేక బీసీ కులాలు రాజకీయంగా పైకి ఎదిగాయని చెప్పారు చంద్రబాబు.

అమరావతి కేసులు వాదించేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో న్యాయవాది ముకుల్‌ రోహత్గీని తీసుకొచ్చారని.. అదే బీసీ రిజర్వేషన్ల కేసు విషయంలో మాత్రం శీతకన్ను వేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి రద్దు కోసం ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షాను కలిసి లాబీయింగ్‌ చేసిన జగన్.. రిజర్వేషన్లు కాపాడటంపై ఎందుకు శ్రద్ధ పెట్టలేదని నిలదీశారు చంద్రబాబు .

స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు వేసిన బీసీ రామాంజనేయులు, బిర్రు ప్రతాపరెడ్డి వైసీపీకి చెందిన వాళ్లు కాదా అని నిలదీశారు చంద్రబాబు. కావాలనే కేసు వేసి రిజర్వేషన్లు అడ్డుకున్నారని ఆరోపించారు. అసత్యాలు చెప్పడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు.

Next Story

RELATED STORIES