సొంత సామాజిక వర్గానికే స్థానిక ఎన్నికల బాధ్యతలు అప్పగించిన జగన్

సొంత సామాజిక వర్గానికే స్థానిక ఎన్నికల బాధ్యతలు అప్పగించిన జగన్

స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం గెలిపించాలి! లేదంటే మంత్రులకు పదవులు ఉండవు. ఎమ్మెల్యే అభ్యర్ధులకు సీట్లు దక్కవు! ఇదీ.. ఏపీ సీఎం జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేలకు జారీ చేసిన అల్టిమేటం.! ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న సీఎం.. ఈ మేరకు వార్నింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విఫలమైన ఎమ్మెల్యేలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు టికెట్లపై ఆశలు పెట్టుకోవద్దంటూ ఖరాఖండిగా చెప్పేశారు. జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంపీణీ చేయబోమని స్పష్టం చేశారు. అలాగే ప్రతిపక్షపార్టీలు సైతం పంచకుండా చూడాలంటూ ఆదేశించారు.

అంతేకాదు.. స్థానిక ఎన్నికల కోసం 13 జిల్లాలను ఐదు జోన్లుగా విభజించి కేవలం తన సామాజిక వర్గానికే బాధ్యతలు అప్పగించడం మరో అంశం. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ఎంపీ విజయసాయిరెడ్డి, ఉభయగోదావరి జిల్లాలకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కృష్ణా, గుంటూరుకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ప్రకాశం- నెల్లూరు, కర్నూలు జిల్లాలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అనంతపురం - కడప- చిత్తూరు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలను బాధ్యులుగా నియమించారు.

ఈ ఇంఛార్జ్‌ల నియాకమం చూస్తే.. ఇతరులపై సీఎం జగన్‌కు నమ్మకం లేదనేది స్పష్టమవుతోంది. ఇంఛార్జులు ఐదుగురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారే. ఉత్తారాంధ్రలో కీలక నేత, మంత్రి బొత్సను కాకుండా.. ఎంపీ విజయసాయిరెడ్డి బాధ్యతలు అప్పగించడం ఉత్తరాంధ్ర వైసీపీలో విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికే వివాదస్పదుడుగా ఉన్న విజయసారెడ్డికి బాధ్యతలు కట్టబెట్టడం ద్వారా తన మనోగతమేంటే స్పష్టంగా చెప్పేశారు జగన్‌. గత కొంతకాలంగా.. విశాఖలోనే విజయసాయిరెడ్డి పాగా వేయడం.. సిటీ పాలిటిక్స్‌లో తనదైన ముద్రవేయడంతో ఆయనకే బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం, కడప- చిత్తూరు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంఛార్జ్‌గా నియమించారు. ఈ మూడు జిల్లాలో కీలక నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా.. వైసీపీలో అత్యంత నమ్మకస్తుడైన సజ్జలకే బాధ్యతలు కట్టబెట్టారు. తద్వారా స్థానిక నేతలెవరిపైనా నమ్మడం లేదని తెలుస్తోంది.

ఇక.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ఉభయగోదావరి జిల్లాలను అప్పగించడం కూడా చూస్తే... జగన్‌ దాదాపుగా ఇతర సామాజిక వర్గాన్ని నమ్మడం మానేశారనే తెలుస్తోంది. ఇక్కడ కూడా తన సామాజిక వర్గానికే బాధ్యత అప్పగించారు. టీడీడీ చైర్మన్‌ ఉన్న వ్యక్తి సాధారణంగా ఎన్నికలకు దూరంగా ఉంటారు. కానీ.. ఇవేవి పట్టించుకోని జగన్‌.. వైవీ సుబ్బారెడ్డికి ఉభయగోదావరి జిల్లాలను అప్పగించారు.

ఇక మరో సీనియర్‌ నేత... ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కృష్ణా గుంటూరు జిల్లాలను అప్పగించడం వెనుక మరో కారణముంది. వ్యాపార, రాజకీయ వర్గాలకు చిరపరిచితమైన వ్యక్తి అయోధ్య రామిరెడ్డి. రామ్ కీ సంస్థల అధినేత. బిగ్‌షాట్‌గా ఉన్న ఈయన.. ఈ ఎన్నికల్లో వనరులను సమీకరణకు కీలకంగా మారుతారనే ప్రచారం జరుగతోంది. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే.. రాజ్యసభకు పంపుతారనే తెలుస్తోంది. దీంతో.. తన సామాజికవర్గానికే చెందిన అయోధ్య రామిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల ఇంచార్జ్‌గా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నియమించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి.. నెల్లూరు రాజకీయాల్లో బిగ్‌ షాట్‌. ఈ మూడు జిల్లాలకు బాధ్యత అప్పగించడం వల్లే.. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని భావిస్తున్నారు జగన్‌. ఈ జిల్లాలో కీలకంగా ఉన్న వైసీపీ నేతలందరినీ విస్మరించారు సీఎం జగన్‌.

ఇక.. సీఎం జగన్‌ కంటే ముందుగానే నిర్ణయాలను ప్రకటించే బొత్స, బూతులతో రంకలేసే మంత్రి కొడాలి నాని, బొత్స తర్వాత తానే నమ్మిన బంటునంటూ చెప్పుకునే.. మంత్రి అనిల్‌ వంటి వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు సీఎం జగన్‌. కేవలం తన సామాజిక వర్గానికీ, అది కూడా తనకు అత్యంత నమ్మకస్తుడైన వారికే లోక్‌ల్‌ ఇంఛార్జ్‌ బాధ్యతలు కట్టబెట్టారు.

10 నెలల క్రితం.. ఒక్కటే తానై.. ఎన్నికల్లో గెలిచిన జగన్‌.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను రెఫరెండంగా భావించలేకపోతున్నారా? అందుకే.. తన సామాజికవర్గానికి చెందినవారికే బాధ్యతలు అప్పజెప్పి.. ఎన్నికల్లో గెలిపించి తీరాల్సిందేనంటూ హుకుం జారీ చేశారా? ఇంతలో ఎందుకింత మార్పు? ఇదే ఇప్పుడు వైసీపీతో పాటు అన్ని రాజకీయావర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags

Read MoreRead Less
Next Story