విపక్షాలను నామినేషన్ వేయకుండా అడ్డుకుంటున్న వైసీపీ వర్గాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ వేసేందుకు కేవలం రెండు రోజులే సమయం ఉంది. అయితే విపక్షాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు వీరంగం సృష్టిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల అండతో రెచ్చిపోతున్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో Mptc నామినేషన్ వేసేందుకు వెళ్లిన తలారి హనుమంతు అనే వ్యక్తిని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో హనుమంతి వర్గాని.. వైసీపీ వర్గీయులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు వచ్చి సర్ధిచెప్పడంతో వైసీపీ శ్రేణులు వెనక్కు తగ్గాయి. ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచెంద్రా రెడ్డి సొంత మండలంలోనూ వైసీపీ దౌర్జన్యాలు హద్దు మీరాయి.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంమండలంలో ఎంపీటీసీ నామినేషన్ పత్రాల కోసం స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన బీజేపీ నేతలను వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. చెరుకువారిపల్లె గ్రామ ఎంపీటీసీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల కోసం నమూనా నామ పత్రాలను తీసుకెళ్లడానికి ఇద్దరితో కలిసి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. బయటకు వస్తున్న సమయంలో వైసీపీ నాయకులు ఆ పత్రాలను లాక్కొని.. వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. మంత్రి నియోజకవర్గంలోనే నామినేషన్ వేస్తావా అంటూ బెదిరించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
విపక్షాలను అడ్డుకోవడమే కాదు. సొంత పార్టీలోనూ వర్గ పోరు బహిర్గతమవుతోంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రణరంగంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని మండలాల పార్టీ నాయకులతో హోంమంత్రి సుచరిత నిర్వహించిన సమావేశాలు రసాభాసగా మారాయి. అన్ని చోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హోంమంత్రి సమక్షంలో కొట్లాటకు దిగారు. ఎన్నికలకు ముందు కలిసి పనిచేసిన నాయకులు ఇప్పుడు గ్రూపులుగా విడిపోయారు. సొంత నియోజకవర్గంలో కార్యకర్తలు తన ముందే కొట్లాడుకుంటుంటే అచేతన స్థితిలో సుచరిత ఉన్నారు. పోలీసులు కలగజేసుకుని పార్టీ కార్యకర్తలను అదుపు చేశారు.
ఇక విజయనగరం జిల్లా సీతానగరం మండలం జోగింపేటలో గ్రామస్తులు రోడ్డెక్కారు. సర్పంచ్‌గా ఎస్టీ రిజర్వేషన్ ప్రకటించడంతో ప్రజలు ఖంగుతిన్నారు. ఎస్టీ ఓటర్లు లేకపోయినా ఎస్టీ రిజర్వ్ ను ప్రభుత్వం ప్రకటించడంతో ఆందోళన చేపట్టారు. గత ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో రిజర్వేషన్ ప్రకటించడంతో ఎన్నికలను ఆ గ్రామస్తులు బహిష్కరించారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. ఎస్టీ అభ్యర్ధిని మార్చకుంటే ఈసారి కూడా ఎన్నికలకు దూరంగా ఉంటామని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com