ఏపీలో తారాస్థాయికి చేరిన రంగుల రాజకీయం

ఏపీలో తారాస్థాయికి చేరిన రంగుల రాజకీయం

ఏపీలో రంగుల రాజకీయంతో వందల, వేల కోట్ల ప్రజాధనం వృధా అవుతోంది. అసలే నిధులు లేక అల్లాడుతున్న రాష్ట్రాన్ని CM అసంబద్ధ నిర్ణయాలు మరింతగా కష్టాల్లోకి నెట్టేస్తున్నాయ్. గత 10 నెలలుగా పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది. ఇది చాలదన్నట్టుగా ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులతో ఇది పరాకాష్టకు చేరింది. నాడు సర్వత్రా విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గని ప్రభుత్వం.. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో కక్కలేక మింగలేక కిందామీదా పడుతోంది. గతంలో పంచాయతీ కార్యాలయాలు, శ్మశానాలు, వాటర్ ట్యాంక్‌లు ఇలా కనిపించిన ప్రతి దానికీ రంగు వేసేందుకు దాదాపుగా 1500 కోట్లు ఖర్చు పెట్టినట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ఈ రంగులు తొలగించి మరో కలర్ వేయాలంటే అందుకు ఇంకో 15 వందల కోట్లు అవసరం. ఈ 3 వేల కోట్లప్రజా ధనం వృధాకి బాధ్యులెవరు? ఇప్పుడీ ప్రశ్నకు ప్రభుత్వంతోపాటు వైసీపీ కూడా సమాధానం చెప్పాల్సి ఉంది.

మార్చిలోగా స్థానిక ఎన్నికలు జరక్కపోతే రూ.4 వేల కోట్లు కేంద్రం నిధులు ఆగిపోతాయని హడావుడిగా రిజర్వేషన్లను కూడా పట్టించుకోకుండా ఎన్నికలు పెడుతోంది ప్రభుత్వం. కేంద్ర నిధులు 4 వేల కోట్లు పోతాయని అంతా బాధపడిపోయిన ప్రభుత్వ పెద్దలు, ఇప్పుడీ 3 వే కోట్ల వృధాకి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ఆ సొమ్మును ఇలా దుబారాగా ఖర్చు చేయడం, గోడలకు సున్నాలకు వాడేయడంపై అంతా మండిపడుతున్నారు. ఈ 3 వేల కోట్ల ప్రజాధనం వృధాకి జవాబుదారీ ఎవరు? ఆదేశాలిచ్చిన ప్రభుత్వ అధికారులది బాధ్యతా? లేక ముఖ్యమంత్రిది బాధ్యతా? పార్టీ రంగులు వేసినందుకు ఆ పార్టీ నుంచే రికవరీ చేయాలా? ఇప్పుడీ ప్రశ్నలన్నింటికీ అధికారపక్షం సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

అధికారంలోకి రాగానే పొలోమంటూ కనిపించిన ప్రతి గోడకూ రంగులు వేసుకుంటూ పోయారు. ప్రభుత్వ భవనాలు, వాటర్ ట్యాంక్‌లు, శ్మశానాలు, పార్క్‌లు, కుళాయిలు, కుండీలు దేన్నీ వదల్లేదు. దీనిపై కొద్ది నెలల కిందటే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు తీర్పు వచ్చింది. 10 రోజుల్లో ఈ రంగులు తొలగించాలని హైకోర్టు విస్పష్టంగా ఆదేశాలివ్వడంతో.. తెలిసీ మొండిగా ముందుకెళ్లినందుకు మరో 1500 కోట్లు లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. అత్తసొమ్ము అల్లుడి దానం అన్నట్టుగా ఎడాపెడా ఖర్చులతో ఖజానా ఖాళీ చేసిన సర్కార్ తీరుపై కామన్‌మేన్ మండిపడుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story