హైదరాబాద్‌‌లో కరోనా అనుమానితుడు మృతి.. వైరస్ నియంత్రణకు కేంద్రం పకడ్బందీ చర్యలు

హైదరాబాద్‌‌లో కరోనా అనుమానితుడు మృతి.. వైరస్ నియంత్రణకు కేంద్రం పకడ్బందీ చర్యలు

దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 60 కి చేరింది. వీరిలో 16 మంది ఇటాలియన్లు ఉన్నారు. మిగతావారంతా భారతీయులేనని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, వీరిలో విదేశాల నుంచి వచ్చినవారే ఎక్కువగా వున్నారు. కరోనా అనుమానితులకు కనీసం రెండుసార్లు పరీక్షలు నిర్వహించిన తర్వాతే వైరస్ ను నిర్ధారిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

కరోనా నియంత్రణకు కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. చైనా సహా ఇతర దేశాల పౌరులకు ఇచ్చే అన్ని రకాల వీసాలపై ఆంక్షలు విధించింది. తాజాగా.. ఇటలీ, దక్షిణ కొరియా నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా ఫ్రీ సర్టిఫికెట్‌ తీసుకురావాలని స్పష్టం చేసింది. ఇకపై ఈ రెండు దేశాల పౌరులు భారత్ కు రావాలనుకుంటే.. తమకు కరోనా లేదని నిర్ధారణ చేసుకోవాల్సివుంటుంది. తమ వెంట గుర్తింపు పొందిన వైద్య సంస్థల నుంచి.. కరోనా నెగెటివ్ సర్టిఫికెట్‌ తీసుకొస్తేనే భారత్ లోకి అనుమతిస్తారు. అటు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విమానాశ్రయాల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు.

ఇదిలావుంటే, భారత్ లో కరోనా అనుమానితుడు మృతిచెందడం కలకలం రేపుతోంది. కర్నాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు.. హైదరాబాద్‌ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో మృతిచెందాడు. ఇతడు ఇటీవలే సౌదీ అరేబియా నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. అంతిమ సంస్కారాల కోసం వృద్ధుడి మృతదేహాన్ని సొంతూరు కలబుర్గికి తీసుకెళ్లారు. చనిపోయిన వృద్ధుడికి కరోనా లక్షణాలు వున్నాయని కలబుర్గి జిల్లా వైద్యాశాఖ అధికారి ప్రకటించారు. మృతుడి నమూనాలను సేకరించిన పరీక్షలకు పంపించినట్టు తెలిపారు. రిపోర్ట్ రావాల్సి వుందన్నారు. ఒకవేళ మృతుడికి కరోనా సోకిందని తేలితే.. భారత్ లో ఇదే తొలి కరోనా డెత్ కానుంది.

మరోవైపు, కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ కు కూడా పాకింది. నెల్లూరు జిల్లా యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మధ్యే ఇటలీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా వున్నట్టు తేలింది. దీంతో ఆ యువకుడు నివసించే ప్రాంతంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు, ఇటలీ నుంచి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరెవరిని కలిశాడనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story