ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. అప్రమత్తమైన దేశాలు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. అప్రమత్తమైన దేశాలు

ఒక చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్ని ఆటాడిస్తోంది. ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేస్తోంది. ధనిక, పేద దేశం అన్న తేడా లేదు. అత్యంత వేగంగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది కరోనా వైరస్. అమెరికాలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. తొలి రోజుల్లో అంతా సవ్యంగానే ఉందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించినా.. చివరకు హెల్త్ ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 5 వేల కోట్ల డాలర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ట్రంప్. అమెరికాలో ఇప్పటి వరకు 49 మంది మరణించగా.. 2 వేల మందికి వైరస్ సోకింది. అయితే ఇటీవల కరోనా వైరస్‌ బారిన పడ్డట్లు గుర్తించిన పలువురు ప్రముఖులు గతంలో ట్రంప్‌ని కలిశారు. దీంతో తాను కూడా పరీక్షలు చేయించుకోవాల్సి రావొచ్చని స్వయంగా ప్రకటించారు ట్రంప్. అయితే, తనకు ఇప్పటి వరకు ఎలాంటి వైరస్‌ లక్షణాలు మాత్రం లేవని స్పష్టం చేశారు.

అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ విధించడంతో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్లలో మార్చి 16 నుంచి వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. USలోని భారత విద్యార్థులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని అక్కడి భారత రాయబార కార్యాలయం తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచించింది. ఇప్పటికే 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు.

కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించింది. ఇప్పటి వరకు 145 దేశాలకు పాకింది. లక్షా 45 వేల మందికి పైగా బాధితులుగా మారారు. 5 వేల 4 వందల మందికిపైగా మంది మృతి చెందారు. చైనాలో తగ్గుముఖం పట్టిననప్పటికీ.. ఇప్పుడు ఐరోపా కేంద్రంగా కొవిడ్-19 వేగంగా విస్తరిస్తోందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కోరింది. ఇంటి నుంచే తమ సేవల్ని అందించాలని కోరింది. కరోనా మొదట వెలుగులోకి వచ్చిన చైనాలోని వుహాన్‌ నగరంలో వరుసగా తొమ్మిదో రోజు వైరస్‌ బాధితుల సంఖ్య తగ్గింది. చైనాలో శుక్రవారం 11 కేసులు నమోదయ్యాయి. మరో 13 మంది మృతిచెందగా.. మరణించిన వారి సంఖ్య 3,189కు చేరింది.

ఇటలీపై కరోనా పంజా విసురుతోంది. 24 గంట్లో 250 మంది పొట్టనబెట్టుకుంది. దీంతో మృతుల సంఖ్య 12 వందలు దాటింది. కొత్తగా మరో 2,500 మందికి వైరస్‌ సోకింది. దీంతో బాధితుల సంఖ్య 17 వేలు దాటింది. ఇజ్రాయెల్‌లోనూ పరిస్థితి తీవ్రమవుతోంది. దీంతో మాస్కులు, ఇతర ఔషధాలు తమ దేశానికి ఎగుమతి చేయాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహూ భారత ప్రధాని మోదీని కోరారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో 150 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. మరో 35 వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారు.

కెనడా పార్లమెంటు సమావేశాల్ని రద్దు చేశారు. ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన భార్యకు వైరస్‌ సోకడంతో ట్రూడో ఇంటి నుంచే విధుల్ని నిర్వర్తిస్తున్నారు. కెనడాలో ఇప్పటి వరకు 138 మందికి వైరస్‌ సోకగా.. ఒకరు చనిపోయారు. దక్షిణ కొరియాలో కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగుతోంది. కొత్తగా వైరస్‌ బారినపడుతున్న వారికంటే కోలుకుంటున్నవారే ఎక్కువగా ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం. శుక్రవారం కొత్తగా 107 మందికి వైరస్‌ సోకినట్లు ప్రభుత్వం ప్రటించింది. ఇప్పటి వరకు 67 మంది మృత్యువాత పడ్డారు. ఇరాన్‌లో 514 మందిని ఈ మహమ్మారి బలిగొంది. స్పెయిన్‌లో 133 మందిని, ఫ్రాన్స్‌లో 79 మందిని పొట్టనబెట్టుకుంది.

ఇప్పటి వరకు వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్న లాటిన్‌ అమెరికా దేశాలకూ కరోనా వ్యాపించడం కలకలం రేపుతోంది. ఈక్వెడార్‌లో శుక్రవారం తొలిమరణం సంభవించింది. వెనిజువెలా, ఉరుగ్వే, గ్వాటిమాలా, సురినామ్‌ దేశాల్లో తొలి కేసులు నమోదయ్యాయి. దీంతో పలు దేశాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story