ఎన్నికలు వాయిదా పడకుండా చూసేందుకు ఏపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం

ఎన్నికలు వాయిదా పడకుండా చూసేందుకు ఏపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నం

స్థానిక ఎన్నికలు 6 వారాలు వాయిదా పడడాన్ని వైసీపీ సర్కార్ జీర్ణించుకోలేకపోతోంది. గవర్నర్ వద్ద ఇప్పటికే దీనిపై పంచాయితీ పెట్టిన CM జగన్.. ఇప్పుడు సుప్రీంకి వెళ్లారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల వాయిదాను సవాల్‌ చేస్తూ వేసిన ఈ పిటిషన్‌ షెడ్యూల్ ప్రకారం మంగళవారం విచారణకు రావాల్సి ఉంది. దీన్ని రెగ్యులర్ లిస్టులో చేర్చాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను జస్టిస్ లలిత్ ఆదేశించారు. అయితే తాజా షెడ్యూల్‌ ప్రకారం ఇందులో మార్పులు జరిగాయి. మంగళవారం ఎలాంటి పిటిషన్లనూ విచారణకు స్వీకరించడం లేదంటూ సుప్రీం కోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో ఎన్నికలు వాయిదా వేశారని జగన్ మండిపడుతున్నారు. SECయే సర్వస్వం అన్నట్టు వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఆగమేఘాలపై సుప్రీం తలుపు తట్టారు. వీలైనంత త్వరగా స్టే తెచ్చుకొని మళ్లీ ఎలక్షన్లు నిర్వహించాలని భావించారు. అయితే మంగళవారం సుప్రీంకోర్టు ఎలాంటి పిటిషన్లు స్వీకరించకపోవడంతో.. తీర్పు మరింత ఆలస్యం కానుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు గల కారణాలను వివరించారు. ఏ పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో చెప్పినట్లు తెలుస్తోంది. ఎస్‌ఈసీ నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రమేష్‌కుమార్‌ను రాజ్‌భవన్‌కు పిలిపించి గవర్నర్‌ మాట్లాడినట్లు సమాచారం. ఎస్‌ఈసీతోపాటు ఐజీ సత్యనారాయణ కూడా గవర్నర్‌ను కలిశారు. దాదాపు 45 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఎన్నికలు యథావిధిగా చేపట్టేందుకు కార్యాచరణ చేపట్టాలని విన్నవించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి లేదని.. పరిస్థితి అదుపులోనే ఉందని వివరించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోందని లేఖలో వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి లేకుండా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. పోలింగ్‌ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని తెలిపారు. మరో 3,4 వారాలపాటు కరోనా నియంత్రణలోనే ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదలపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో విచారణ జరిగింది. తక్షణమే ఎలక్షన్లు జరిపించాలన్న లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వంతో సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని పిటిషన్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఇదే అంశంపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ ఉన్నందున తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story