అగ్రదేశాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19

అగ్రదేశాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. అగ్రదేశం అమెరికాను సైతం అతలాకుతలం చేస్తోంది. కొవిడ్ -19 దేశంలో వేగంగా విస్తరిస్తుండటంతో దాదాపు అన్ని రాష్ట్రాలు షట్ డౌన్ ప్రకటించాయి. వైరస్ బారిన పడి మరిణించిన వారి సంఖ్య 88కు చేరింది. 4వేల 700 మందికి వైరస్ సోకడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పదికంటే ఎక్కువ మంది గుమికూడ వద్దని సూచించింది. వాషింగ్టన్ లో అత్యధికంగా 48మంది మరణించారు. కాలిఫోర్నియాలో 11, న్యూయార్క్, ఫ్లోరిడాలో 5, న్యూజెర్సీ, లూసియానాలో 3, వర్జీనియాలో2 చొప్పున మరణాలు సంభవించాయి. మరో పది రాష్ట్రాల్లో ఒకరు చొప్పున మృత్యువాత పడ్డారు. అమెరికాలో మొదటికేసు జనవరిలో నమోదైంది. చైనా నుంచి వాషింగ్టన్ వచ్చిన వ్యక్తిలో వైరస్ లక్షణాలను గుర్తించారు. కేవలం రెండు నెలల వ్యవధిలో వైరస్ దేశంలోని 49 రాష్ట్రాలకు వ్యాపించి 4,700 మందికి సోకి మరణమృదంగాన్ని మోగిస్తోంది. దీంతో అమెరికాలో ఎప్పుడు కనీవినీ ఎరుగని పరిస్థితిని చూడాల్సి వస్తోంది. వైరస్ వ్యాప్తి, ప్రభుత్వ ఆంక్షలనేపధ్యంలో జనం నిత్యావసర వస్తువులను నెలలకు సరిపడా కొనుగోలు చేయడంతో షాపులన్ని సరుకులు లేక వెలవెలబోతున్నాయి. జన సంచారం లేక రోడ్లన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి.

ఎక్కువ మరణాలు సంభవించిన వాషింగ్టన్ లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక్కడ 900లకు పైగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీనికి తోడు అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ నగరంలోను పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఇక్కడ 950 పైగా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక కాలిఫోర్నియాలో 450మందికి వైరస్ వ్యాపించింది. అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్ధులకు ఇళ్లకే పరిమితమయ్యారు. రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్స్ మాల్స్ కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించడంతో ఉద్యోగులు ఇళ్లనుంచే పనులు చేస్తున్నారు.

అయితే కరోనా ప్రభావం కారణంగా దేశంలో ఆర్ధిక మాద్యం వస్తుందేమోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రయాణాలపై నిషేధం విధించిన నేపధ్యంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విమానయాన సంస్థలను ఆదుకుంటామని ట్రంప్ హామి ఇచ్చారు. పదిమందికంటే ఎక్కువమందితో నిర్వహించే అన్నిరకాల సమావేశాలను రద్దుచేసుకోవాలని సూచించారు. వచ్చే జులై, ఆగస్టులో వైరస్ వ్యాప్తి అదుపులోకివచ్చే అవకాశం ఉందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. దేశంలో పరిస్థితి దయనీయంగా ఉందని స్వయంగా ట్రంప్ ప్రకటించడం అక్కడ పరిస్థితికి అద్దం పడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story