కరోనా దెబ్బకు వెలవెలబోతున్న తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు

కరోనా దెబ్బకు వెలవెలబోతున్న తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు

కరోనా మహమ్మారి దేవుణ్ణి కూడా వదలడం లేదు. రాకాసి వైరస్ దెబ్బకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. కలియుగ దైవం కొలువైన తిరుమలలోనూ భక్తుల రద్దీ తగ్గింది. ఇక, వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. శ్రీవారి ఆలయ పుష్కరిణిని మూసివేస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆలయ పరిసరాలు, పుష్కరిణి, మాఢవీధుల్లో వైరస్ నియంత్రణకు మందులు పిచికారిని ఆయన పరిశీలించారు. భక్తులు స్నానం ఆచరించడానికి పుష్కరిణికి పైభాగంలో ఏర్పాటు చేసిన షవర్స్ ను సంఖ్యను పెంచాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.

ప్రపంచవ్యాప్తంగా వేలమందిని పొట్టనబెట్టుకుంటున్న కరోనా వైరస్ అంతరించిపోవాలంటూ.. శ్రీకాళహస్తిలో హోమం నిర్వహించారు. ప్రపంచ జనాభా ఆయురారోగ్యాలతో క్షేమంగా జీవించాలని కోరుతూ.. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీర స్వామి ఆలయం ప్రాంగణంలోని.. 16 కాళ్ల మండపంలో శ్రీ ధన్వంతరి హోమం నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ధూపదీప నైవేద్యాలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా యాగాన్ని పూర్తిచేశారు. యాగంలో పాల్గొన్న పండితులకు ఆలయ ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. యాగంలో పాల్గొన్న భక్తులు కరోనా వైరస్ అంతరించిపోవాలని.. జ్ఙానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామిని వేడుకున్నారు.

కరోనా ఎఫెక్ట్ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిపైనా పడింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే యాదాద్రి పుణ్యక్షేత్రం.. వెలవెలబోతోంది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ భక్తుల రద్దీ తగ్గిపోతోంది. భక్తులు లేక క్యూలైన్లనీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. క్యూలైన్లతో పాటు.. లడ్డూ కౌంటర్లు, సత్యనారాయణ స్వామి మండపం కూడా బోసిపోయాయి. దీంతో యాదాద్రి కొండ నిర్మానుష్యంగా మారింది. కొంతమంది భక్తులు దర్శనానికి వస్తున్నా.. మాస్కులు ధరించి వస్తున్నారు. మరోవైపు ఆలయానికి వస్తున్న భక్తుల చేతులను కెమికల్ స్ప్రేతో శుభ్రం చేస్తున్నారు. అటు అర్చకులు, ఆలయ సిబ్బంది సైతం మాస్కులు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. భక్తుల రాక తగ్గిపోవడంతో వ్యాపారులు కూడా దుకాణాలను మూసివేశారు.

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడపైనా కరోనా ప్రభావం పడింది. భక్తుల రాక భారీగా తగ్గిపోయింది. ఇదిలావుంటే, ఓ వృద్ధురాలు కరోనా లక్షణాలతో ఆలయానికి రావడంతో కలకలం రేగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన మల్లవ్వ.. తన కుటుంబ సభ్యులతో కలిసి రాజన్న దర్శనానికి వచ్చింది. అయితే, మల్లవ్వకు హైటెంపరేచర్‌ తో పాటు, దగ్గు ఉండటంతో అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. మహారాష్ట్ర, చత్తీస్ గఢ్‌ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రాజన్న దర్శనానికి వస్తుంటారు. ఈ నేపంథ్యంలో భక్తులకు టెంపరేచర్‌ చెక్‌ చేసిన తర్వాతే ఆలయంలోకి అనుమతిస్తున్నారు. అటు వేములవాడలో ఇప్పటికే షాపింగ్ కాంప్లెక్స్ లు, చికెన్ సెంటర్లను క్లోజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

కరోనా ప్రభావం మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని కూడా వదల్లేదు. కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరికల నేపథ్యంలో దర్శనాలను తాత్కాలికంగా మూసివేశారు. ఇంటిదగ్గరి నుంచే రాఘవేంద్రస్వామిని ప్రార్థించుకోవాలని శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామి భక్తులకు విజ్ఙప్తి చేశారు. అయితే, శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు యధావిధిగా జరుగుతాయని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story