కరోనాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు

కరోనాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు

దేశంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్రం కఠిన చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశకు చేరకుండా కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేస్తోంది. అత్యవసర సర్వీసులు మినహా.. ఉద్యోగులందరూ ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎమర్జెన్సీ సర్వీస్‌లో ఉన్నవాళ్లే ఆఫీసులకు రెగ్యులర్‌గా రావాలని సూచించింది. అవకాశం ఉన్న ప్రతి ప్రైవేటు కంపెనీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. 65 ఏళ్లు దాటిన వ్యక్తులు, పది సంవత్సరాల లోపు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. అలాగే దేశవ్యా ప్తంగా అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. మార్చ్ 22 నుంచి మార్చ్ 31 వరకు ఇంటర్నేషనల్ సర్వీస్‌లు నిలిచిపోతాయి. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రకాల ప్రత్యేక రైళ్లను రద్దు చేశారు. అలాగే వారం రోజుల పాటు అన్ని అంతర్జాతీయ సరిహద్దులు మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరంగా-తప్పనసరి పరిస్థితి ఉంటేనే ప్రయాణాలు పెట్టుకోవాలని తెలిపింది. లాక్ డౌన్ భయాలు అవసరం లేదని కేంద్రం పేర్కొంది. ఇక, కేంద్రం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు చేపడుతున్నాయి. ఢిల్లీలో ప్రధాన ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. హోమ్ డెలివరీస్ రద్దు చేశారు. మార్చ్ 31 వరకు హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మెజార్టీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఆప్షన్ ఇచ్చారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు రోజు విడిచి రోజు ఆఫీసుకు రావాలని ఆదేశించింది.

దేశంలో మరో కరోనా మరణం సంభవించింది. పంజాబ్‌లో ఓ వ్యక్తి కరోనా వైరస్‌తో మృతి చెందాడు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు పెరిగింది. గతంలో ఢిల్లీ, ముంబై, కర్ణాటకల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా దేశవ్యాప్తంగా 175 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 47, కేరళలో 25, కర్ణాటకలో 14 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 15 మంది కోలుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రెండుకు చేరాయి. తెలంగాణలో 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ నివారణకు ఆయా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు సైతం మూసివేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఎయిర్‌పోర్టులో దిగుతున్న ప్రయాణికులకు హోమ్‌ క్వారంటైన్‌ ముద్ర వేస్తోంది

Tags

Read MoreRead Less
Next Story