తాజా వార్తలు

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. చర్యలు విస్తృతం చేస్తున్న ప్రభుత్వం

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. చర్యలు విస్తృతం చేస్తున్న ప్రభుత్వం
X

కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో వైరస్ బాధితుల సంఖ్య 18కి పెరిగింది. అందరూ విదేశాల నుంచి వచ్చినవారే. ఇందులో ఎవరికీ ప్రాణాపాయం లేదు. అటు హైకోర్టు ఆదేశాలతో పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా వేశారు. శనివారం పరీక్ష మాత్రం యధాతధంగా ఉంటుంది. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు కరీంనగర్‌లో పర్యటించనున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సీఎం పర్యటనలో పాల్గొననున్నారు. కరీంనగర్‌లో పర్యటించిన తర్వాత అక్కడే సమీక్ష నిర్వహిస్తారు కేసీఆర్. చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై సూచనలు చేయనున్నారు. వాస్తవానికి శుక్రవారమే కేసీఆర్ కరీంనగర్‌లో పర్యటించాల్సి ఉంది. కానీ ప్రధానమంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్ ఉండటంతో శనివారం వాయిదా పడింది.

కరీంనగర్‌లో బుధవారం ఒక్కరోజే ఏడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా నుంచి వచ్చిన 11 మందిలో ఏడుగురికి కరోనా సోకింది. ఒకేసారి ఇంత మందికి కరోనా సోకడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన అధికారులు ఇప్పటికే జిల్లా కేంద్రంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారు అన్న వివరాలను సేకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సూచించారు. ప్రజలెవరూ అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశించారు.

కరోనా ఎఫెక్ట్ తో కరీంనగర్ నిర్మానుష్యంగా మారింది. నగరంలో అప్రకటిత కర్ఫ్యూ కొనసాగుతోంది. వ్యాపారస్తుల నుంచి అధికారులకు పెద్దయెత్తున సహకారం అందుతోంది. రెండోరోజు కూడా షాపులు క్లోజ్ చేశారు. గురువారం 144 సెక్షన్ విధించి షాపులు క్లోజ్ చేయగా.. శుక్రవారం స్వయంగా షాపులు మూసేశారు. తొలి రోజు 26 వేలమందికి స్క్రీనింగ్ నిర్వహించిన అధికారులు.. ఈరోజు మరో 26 వేల మందికి స్క్రీనింగ్ టెస్ట్ లు చేశారు. అయితే, ఇప్పటివరకు ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కరీంనగర్‌లో స్క్రీనింగ్ టెస్ట్ లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ నెల 31 వరకు కరీంనగర్ మొత్తం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఆరోగ్య కరీంనగర్ గా మార్చడమే తమ లక్ష్యమని అంటున్నారు. వదంతులు నమ్మకూడదని పిలుపునిచ్చారు.

Next Story

RELATED STORIES