తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో 19కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 19కి చేరాయి. శుక్రవారం ఒక్కరోజే 3 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. వీరిలో లండన్‌ నుంచి వచ్చిన 18 ఏళ్ల యువతితో పాటు ఇండోనేషియా నుంచి వచ్చిన మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపింది. ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో ఒకరు 27 ఏళ్ల యువకుడు కాగా, మరొకరు ఇటీవల కరీంనగర్‌ వచ్చిన బృందంలో 60 ఏళ్ల వృద్ధుడిగా గుర్తించారు.

మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వాళ్లు సెల్ఫ్ క్వారంటైన్ అయ్యారా? లేదా? వారి ఆరోగ్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి గురించి అధికారులు వాకబు చేస్తున్నారు. సెల్ఫ్ క్వారంటైన్ జరిగిన ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాలు, కరోనా పాజిటివ్ నమోదైన ఏరియాల్లో ప్రత్యేక రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. ప్రభుత్వం క్వారంటైన్ చేసిన ప్రాంతాలపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు సెల్ఫ్‌ క్వారెంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఇటీవలే వీరిద్దరూ అమెరికా పర్యటన నుంచి వచ్చారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా.. సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలంటూ.. జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కోనప్ప దంపతులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వుందన్నారు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్రంలో 6 ల్యాబ్ లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నవాళ్లకు కరోనా రాలేదని.. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకే కరోనా వచ్చినట్లు తెలిపారు.

కరోనా ఎఫెక్ట్‌తో టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. శనివారం జరగాల్సిన పరీక్ష యథాతథంగా కొనసాగుతుంది. సోమవారం నుంచి జరగాల్సిన అన్ని ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story