అగ్రదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా

అగ్రదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా

కరోనా వైరస్ అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికాలో కరోనా విలయ తాండవం చేయబోతోందంటూ వచ్చిన హెచ్చరికలు నిజమవుతున్నాయి. చైనా, ఇటలీ, స్పెయిన్‌లో ఉత్పాతం సృష్టించిన వైరస్.. ఇప్పుడు అగ్రరాజ్యంలోనూ ఉత్పాతం సృష్టిస్తోంది. బాధితుల విషయంలో చైనా, ఇటలీ, స్పెయిన్‌లను అమెరికా దాటేసింది. అగ్రరాజ్యంలో ఏకంగా 85 వేలకు పైగా కేసు లు నమోదయ్యాయి. 13 వందల మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో అమెరికాలో నమోదైన కేసులే 14.9 శాతం ఉన్నాయి. ప్రపంచంలోనే ఎక్కువ కేసులు నమోదై న దేశాల జాబితాలో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. ఒక్క న్యూయార్క్‌లోనే 38వేల మంది వైరస్ బారినపడ్డారు. 281 మంది మరణించారు. అదే చైనాలో 81, 340 కేసులు నమోదు కాగా, 3 వేల 292 మంది మరణించారు. ఇటలీ కూడా చైనాకు సమీపంలో ఉంది. ఇటలీలో 80 వేల 6 వందల కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఏకంగా 8 వేల 216 మంది ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌లో 57, 786 కేసులు నమోదు కాగా, 4, 365 మంది చనిపోయారు.

అమెరికాలో కరోనా విజృంభణకు చాలా కారణాలే ఉన్నాయి. ప్రభుత్వ అలసత్వం, స్వయం తప్పిదాలు అమెరికన్లను ప్రమాదంలో పడేశాయి. ఇదే సమయంలో కరోనాను పూర్తి స్థాయిలో అరికట్టడానికి అమెరికా ప్రభుత్వం కరోనా నిర్దారణ పరీక్షలను పెంచింది. అందువల్లే ప్రతి రోజూ వేల కేసులు నమోదవుతున్నాయి. కేవలం 8 రోజుల్లో 2 లక్షల 20 వేల మందికి పరీక్షలు చేశారు. ఐతే, చైనా, ఇటలీతో పోలిస్తే అమెరికాలో డెత్ రేట్ తక్కువగా ఉండడం గమనార్హం.

బ్రిటన్‌లో కరోనా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 115 మంది మరణించారు. మృతుల సంఖ్య 100 దాటడం ఇదే తొలిసారి. మొత్తంగా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 578కి చేరింది. బాధితుల సంఖ్య 11 వేల 658కి పెరిగింది. కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బ్రిటన్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. త్వరలో బ్రిటన్ మరో ఇటలీగా మారే ప్రమాదం లేకపోలేదని అంచనా వేస్తున్నారు.

స్పెయిన్‌లోనూ పరిస్థితి అంతకంతకూ విషమిస్తోంది. ఇటలీ తర్వాత అత్యధిక మరణాలు ఇక్కడే సంభవించాయి. గురువారం ఒక్కరోజే 655 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 4,365కు పెరిగింది. బాధితుల సంఖ్య 57, 786గా నమోదైంది. ఇరాన్‌లో ఇప్పటి వరకు 29,406 కేసులు నమోదుకాగా.. వీరిలో 10,457 మంది కోలుకోవడం ఊరట కలిగిస్తోంది. ఇక గురువారం ఇరాన్‌లో 157 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 2,234కు చేరింది.

Tags

Read MoreRead Less
Next Story