కోవిడ్‌ భూతంతో విలవిల్లాడుతున్న ప్రపంచం

కోవిడ్‌ భూతంతో విలవిల్లాడుతున్న ప్రపంచం
X

కోవిడ్‌ భూతంతో ప్రపంచం విలవిల్లాడుతోంది. ఇటలీ, స్పెయిన్‌, అమెరికా, ఇరాన్‌ దేశాల్లో మరణమృదంగం కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 5 లక్షల 96 వేల మార్క్‌కు చేరగా.. 27 వేల 4 వందల మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి 196 దేశాలకు విస్తరించింది. దీంతో నిత్యం ప్రతి దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది. పలు దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించి కోవిడ్‌ కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందన్న ఆందోళనతో.. లాక్‌డౌన్‌కు వెనకడుగు వేస్తున్నాయి.

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ గడ గడలాడిస్తోంది. చైనా, ఇటలీని దాటేసి కరోనా కేసుల్లో కొత్త రికార్డులను సృష్టిస్తోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటడం ఆ దేశాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఒకే రోజు 15 వేల కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. యూఎస్‌లో ఇప్పటి వరకు 15 వందల మంది కోవిడ్‌కు బలయ్యారు. బాధితులకు సరైన వెంటి లేటర్లు లేని పరిస్థితి. ట్రంప్‌ ఘోర వైఫల్యం, నిర్లక్ష్యం వల్లే దేశానికి ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చైనా కరోనాని అసాధారణ స్థాయిలో నియంత్రించినప్పటికీ అమెరికా, యూరప్‌ దేశాల్లో కరోనా విజృంభణ ఇంకా ఆగలేదు. అమెరికా, యూరప్‌ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పటికీ.. ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతూ ఉండడంతో సౌకర్యాల్ని ఏర్పాటు చేయలేక బెంబేలెత్తిపోతున్నాయి. ఇటలీలో 86 వేల 498 కేసులు నమోదు కాగా.. 9 వేల 134 మంది మరణించారు. అత్యధిక మరణాలు సంభవించిన దేశంగా ఇటలీ రికార్డు సృష్టించింది. వైరస్‌ పుట్టిన చైనాలో 81 వేల 343 కేసులు నమోదయ్యాయి. 3వేల 292 మంది మృతి చెందారు. వారం రోజులుగా చైనాలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఇక స్పెయిన్‌లో 64 వేల 59 కేసులు నమోదు కాగా.. 4 వేల 934 మంది చనిపోయారు. ఇక ఇరాన్‌లో 32 వేల 332 కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు 2 వేల 378 మంది ప్రాణాలు కోల్పోయారు.

యూకేలో కేసుల సంఖ్య క్రమంగా పెరగుగుతోంది. ఇప్పటివరకు 14వేల 735 కేసులు నమోదు కాగా 769 మంది చనిపోయారు. కరోనా వైరస్‌ను ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. దేశాధినేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా సోకింది. బోరిస్ జాన్సన్‌కు పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దాంతో ఆయ న్ను క్వారంటైన్ చేశారు. బోరిస్ జాన్సన్‌ గత 24 గంటలుగా దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. దాంతో కరోనా వైరస్ లక్షణాలుగా అనుమానించిన ఆయన వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల్లో బోరిస్‌కు కరోనా సోకిందని బయటపడింది. దీంతో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రికి కూడా కరోనా పాజిట్‌గా తేలింది.

Next Story

RELATED STORIES