ప్రధానికి లేఖ రాసిన కమల్ హాసన్.. ఘాటైన వ్యాఖ్యలు

ప్రధానికి లేఖ రాసిన కమల్ హాసన్.. ఘాటైన వ్యాఖ్యలు
X

మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌హాసన్‌.. ప్రధాని మోదీకి లేఖ రాసి సంచలన వ్యాఖలు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే విషయంలో ప్రధాని మోదీ దీర్ఘదృష్టి చిత్తుగా ఓడిపోయిందని మూడు పేజీల లేఖను రాశారు. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, బాధితులలో ఒకడిగా ఆ లేఖను రాస్తున్నానని మొదలు పెట్టిన కమల్.. మోదీని ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లాక్‌డౌన్‌వల్ల తీవ్రంగా నష్టపోయే అసంఘటిత కార్మికులకు నష్టపరిహారాన్ని వారి బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని.. గత మార్చి 23న తాను రాసిన లేఖ గురించి ఆయన గుర్తు చేశారు. అయితే.. ఆ మరుసటి రోజే.. పెద్ద నోట్లను రద్దు విషయాన్ని ప్రకటించిన రీతిలోనే.. ఎలాంటి ముందస్తు ప్రణాళికలేవీ సిద్ధం చేసుకోకుండా అప్పటికప్పుడు దేశమంతటా నిషేధాజ్ఞలు విధించడం గర్హనీయమని పేర్కొన్నారు. ముందస్తు సమాచారం, ప్రణాళిక లేకుండా ఇలా లాక్‌డౌన్‌ను ప్రకటించటం సబబేనా అని ప్రశ్నించారు.

దేశ ప్రజలంతా మిమ్మలనే నాయకుడిగా ఎంచుకున్నారని.. ఈ క్లిష్టపరిస్థితులలో దేశం మొత్తం మిమ్మల్ని అనుసరిస్తున్నారని గుర్తు చేస్తున్నా అని అన్నారు. ఓ నాయకుడు చెబితే ఇన్ని కోట్ల మంది అనుసరిస్తున్నారంటే ఆ గొప్పదనం ప్రధాని మోదీకే దక్కుతుందని, అలాంటి అవకాశం మరే దేశంలోనూ లేదని అన్నారు. కరోనా బాధితులకు చికిత్సలందిస్తున్న వారి సేవలను గుర్తించి చప్పట్లు తట్టమని చెబితే చప్పట్లు కొడుతున్నారనే విషయం మోదీకి ఎరుకేనని అన్నారు. అదే సమయంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగిన ఘోర తప్పిదమే ఇప్పుడు పునరావృతమయ్యిందనే భయం తనకు కలుగుతోందని కమల్‌ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగిన తప్పిదం వలన నిరుపేదలు జీవనాధారం క్లోప్యారని.. కానీ ఇప్పుడు జీవితాన్నే కోల్పోయే స్థితిలో ఉన్నారని కమల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మాటలకు గౌరవం ఇచ్చి.. ప్రజలంతా ఓ వైపు నూనె పోసి దీపాలు వెలిగించారని, కానీ.. మరో వైపు రొట్టెలు కాల్చుకోవడానికి కాసింత నూనె కూడా లేక నిరుపేదలు అలమటిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ రెండు సార్లు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించినప్పుడు ప్రజలలో ఓర్పు, సహనాన్ని నింపడానికి ప్రయత్నించారని.. కానీ.. ఇలాంటి సమయాల్లో మానసిక స్థైర్యం కల్పించడం అవసరమే అయినా, అంతకంటే ముందు అత్యవసరంగా చేయాల్సిన పనులెన్నో ఉన్నాయని కమల్‌ తెలిపారు. ప్రధాని ప్రసంగాలు సంపన్నులకు ఉపయోగపడతాయని.. పైకప్పులు లేని ఇళ్ళలో నివసించే బడుగు ప్రజానీకానికి దేనికి పనికిరావని కమల్‌ ఆరోపించారు. నిరుపేదలను పూర్తిగా విస్మరించి సంపన్నుల కోసమే ప్రభుత్వం నడపాలని ప్రధాని మోదీ భావించడం లేదని తనకు తెలుసునని.. అయితే నిరుపేదలను విస్మరించిన ప్రభుత్వాలు ఏమయ్యాయో.. చర్రిత చెబుతుందని అన్నారు.

లక్షలాదిమంది నిరుపేదలు తమ జీవనాధారం పూర్తిగా కోల్పోయారని.. కానీ.. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని కమల్‌ విమర్శించారు. మధ్య తరగతి ప్రజలను విస్మరించాలన్నది తన అభిమతం కాదని, సమాజంలోని అన్ని వర్గాలవారిని కాపాడాలనే కోరుతున్నానని చెప్పారు.

ఏ ఒక్కరూ.. ఆకలితో అలమటించకూడదని చెప్పి.. నిరుపేదలు ఆకలి మంటల్లో ఆహుతయ్యేలా చేయడం సమంజసం కాదని అన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రధాని మోదీ దీర్ఘ దృష్టి చిత్తుగా ఓడిపోయిందని.. తనను దేశ విరోధిగా మోదీ అనుచరులు విమర్శించినా పట్టించుకోనని అన్నారు. తామంతా ఆగ్రహావేశాలతో ఉన్నా.. ప్రధాని వెంటే నిలిచి ఉన్నామని కమల్‌ ఆ లేఖను ముగించారు.

Next Story

RELATED STORIES