వర్షాకాలంలో మళ్లీ వస్తుంది.. 'కరోనా'

ఏంటి.. కేసులు తగ్గాయని సంబరపడుతున్నారా.. అలాంటి ఆశలేం పెట్టుకోకండి.. రెండు నెలల్లో మళ్లీ వస్తా అని కరోనా హెచ్చరిస్తున్నట్టే ఉంది శాస్త్రవేత్తల హెచ్చరికలు చూస్తుంటే. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో అది మరి కాస్త తగ్గవచ్చు. కానీ కొన్ని వారాలు లేదా నెలల తరువాత కేసుల సంఖ్య పెరగొచ్చు అని శివనాడార్ వర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సమిత్ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.
ఇదే అభిప్రాయాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) ప్రొఫెసర్ రాజేశ్ సుందరేశన్ కూడా వ్యక్తం చేశారు. టీకా అందుబాటులోకి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలంలో వచ్చే ఫ్లూ లక్షణాలను అస్సలు అశ్రద్ధ చేయకూడాదని భట్టాచార్య అంటున్నారు. సామాజిక దూరం పాటించడంతో పాటు, మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని సూచించారు.
2022 వరకు ఈ చర్యలన్నీ అమలులో ఉండేలా చూస్తేనే ప్రాణాంతక వైరస్ నుంచి విముక్తి పొందే అవకాశం ఉంటుందని హార్వర్డ్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. జలుబు మాదిరిగానే కోవిడ్ 19 కూడా సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ వ్యాధి తీవ్రత పుంజుకుంటుందని హెచ్చరించారు. చెప్పిన రూల్స్ అన్నీ కచ్చితంగా పాటించినా తరచూ కరోనా టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరమని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com