కోలుకున్న వ్యక్తికే మళ్లీ కోవిడ్..

కోలుకున్న వ్యక్తికే మళ్లీ కోవిడ్..

చుట్టపు చూపుగా రాలేదు. పర్మినెంట్‌గా తిష్ట వేయడానికే వచ్చానన్నట్లుంది కరోనా వైరస్ పరిస్థితి చూస్తుంటే. దాదాపు మూడు నెలలుగా కరోనా కలవరింతలు తప్ప మరొకటి లేదు ప్రపంచం మొత్తానికి. కేసులు తగ్గుతున్నాయి కదా అని సంబరపడుతున్న సమయంలోనే పాజిటివ్ కేసులు పెరుగుతూ అధికారులతో పాటు ప్రజలనూ ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా వైజాగ్‌లో ఓ వ్యక్తి కరోనా బారిన పడి కోలుకున్నాడు. అతడు మార్చి నెలాఖరులో ముంబై నుంచి నగరానికి వచ్చాడు. వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపగా ఏప్రిల్ 3న పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. చికిత్స తీసుకున్నాక రెండు సార్లు మళ్లీ అతడికి పరీక్షలు నిర్వహించారు. రెండు సార్లూ నెగిటివ్ అని నిర్ధారించుకున్నాకే అతడిని డిశ్చార్జ్ చేశారు. తాజాగా అతడికి మళ్లీ వైరస్ సోకినట్లు తేలింది. గతంలో ఇదే కుటుంబానికి చెందిన ఐదుగురు వైరస్ బారిన పడి కోలుకున్నారు. అయితే వారి కుటుంబంలో ఉన్న 18 నెలల చిన్నారికి ఇప్పుడు వైరస్ సోకింది. ఈ చిన్నారి ద్వారానే అతడికి వైరస్ సోకిందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే మరోసారి తిరగబెట్టిందా అనే కోణంలో వైద్యులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్‌టీపీసీఆర్‌తో పరీక్షలు నిర్వహించిన తరువాతే ఏ విషయమూ నిర్ధారించలేమని అధికారులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story