చైనాలో తొలి కేసు నమోదు కంటే ముందే కరోనా వ్యాప్తి !

చైనాలో తొలి కేసు నమోదు కంటే ముందే కరోనా వ్యాప్తి !

చైనాలో తొలి కేసు నమోదు కంటే ముందే కరోనా వ్యాప్తి చెందిందా? అంటే అవునంటున్నారు బ్రిటన్‌ పరిశోధకులు. చైనాలో డిసెంబర్‌ కంటే చాలా ముందే కరోనా వ్యాప్తి మొదలైందని చెబుతున్నారు. ఈ వైరస్‌లో జన్యు మార్పులపై తాము క్రోడీకరిస్తున్న వివరాల డేటాబేస్‌ను ప్రపంచంలోని అన్ని దేశాల సైంటిస్టులకు అందుబాటులో ఉంచుతామన్నారు. వీటిలో 7వేల 600 మంది బాధితులకు సోకిన వైరస్‌ల జన్యుక్రమాలను యూనివర్శిటీ కాలేజ్‌ లండన్‌లోని జెనిటిక్స్‌ విభాగం శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

వివిధ దేశాలకు చెందిన బాధితులు, వారికి వేర్వేరు సమయాల్లో వైరస్‌ సోకిన వారి నమూనాలను వారు తీసుకున్నారు. దీని ప్రకారం.. తొలి కేసును గుర్తించిన నాటికే చాలా ముందే చైనాలో వైరస్‌ సోకడం ప్రారంభమైనట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కచ్చితంగా చెప్పాలంటే.. గత ఏడాది నవంబర్‌ నాటికే వ్యాప్తి మొదలై వేగంగా విస్తరించినట్లు వివరించారు. అన్ని దేశాల్లోనూ దాని మ్యుటేషన్లు కనిపిస్తున్నాయని తెలిపారు. అవి తొలి కేసు నమోదు చేసిన సమయం కంటే ముందే జరిగినట్లు తేల్చారు. పైగా అన్నింటిలోనూ పోలికలు ఉన్నట్లు తెలిపారు.

యూరప్‌లోనూ జనవరి, ఫిబ్రవరిలో తొలి కేసులు నమోదయ్యాయి. కానీ రెండు నెలల ముందే అక్కడ వైరస్‌ వ్యాప్తి జరిగినట్లు జన్యుక్రమాల విశ్లేషణ చెబుతోంది. అదే సమయంలో పలనా వ్యక్తి జీరో పేషెంట్‌ అని నిర్ధారించడానికి అవకాశమే లేదు. ఇక చాలా ఆందోళనకరమైన విషయమేమిటంటే.. ప్రపంచంలో పది శాతం జనాభాకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్రిటన్‌ పరిశోధకులు.

Tags

Read MoreRead Less
Next Story