Top

ఏపీలో అగమ్యగోచరంగా వలస కూలీల పరిస్థితి

ఏపీలో అగమ్యగోచరంగా వలస కూలీల పరిస్థితి
X

లాక్‌డౌన్ కారణంగా వలస కూలీల పరిస్థితి దారుణంగా తయారైంది. ఏపీలో పనిచేస్తున్న వలసకూలీలకు సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి అనుమతులు ఇవ్వడం లేదు. మరోవైపు ఏపీలోకి రావడానికి కూడా అనుమతులు మంజూరు చేయడం లేదు. దీంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో.. బీహార్, ఒడిషా, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి 2 వేల మంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఇటీవల కేంద్రం లాక్‌డౌన్‌ను పొడగించడంతో.. తమను స్వస్థలాలకు పంపాలని వలస కూలీలు కోరుతున్నారు. అయినప్పటికీ వారు స్వస్థలాలకు వెళ్లడానికి అధికారులు అనుమంతించడం లేదు.

ఈ నేపథ్యంలో 700 మంది వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని పోలవరం చెక్‌పోస్ట్ వద్ద అడ్డుకున్నారు. సొంత రాష్ట్రాల నుంచి అనుమతి లేకుండా కార్మికులు వెళ్లడానికి వీల్లేదని అధికారులు తేల్చిచెప్పారు. అధికారుల తీరును నిరసిస్తూ కార్మికులంతా చెక్‌పోస్ట్ వద్ద బైఠాయించారు. తమను సొంత రాష్ట్రాలకు పంపేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని.. అవసరమైతే నడిచి వెళ్తామని భీష్మించారు.

ఏదోరకంగా కార్మికులకు నచ్చజెప్పి ప్రాజెక్ట్ సైట్‌లోకి పంపించేందుకు రెవిన్యూ, పోలీసులు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కార్మికులు మాత్రం తమను వెంటనే స్వస్థలాలకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వలస కూలీల ఆందోళనతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. కార్మికులు మొండిగా ముందుకువెళ్తే పరిస్థితులు ఎలా వుంటాయోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలావుంటే, కృష్ణాజిల్లా జగ్గయ్యపేట గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతులు లేక కొన్ని వేల సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. ఆంధ్ర పోలీసుల పర్మిషన్ లేకుండా బోర్డర్ దాటి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మాట వినకుండా బోర్డర్ దాటితే క్వారంటైన్‌కు తరలిస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Next Story

RELATED STORIES