బ్రేకింగ్.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల వద్ద వాహనాలను నిలిపివేసిన అధికారులు

బ్రేకింగ్.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల వద్ద వాహనాలను నిలిపివేసిన అధికారులు

తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల దగ్గర సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి సమీపంలోని తాటియాకుల గూడెం వద్ద.. రెండు రాష్ట్రాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద వాహనాలను ఏపీ అధికారులు నిలిపివేశారు. తెలంగాణ అధికారుల నుంచి అనుమతి తీసుకుని వచ్చినవారిని సైతం.. ఆంధ్రప్రదేశ్‌లోకి అనుమతివ్వలేదు.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌వాసులు.. సడలింపుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు క్యూ కట్టారు. జీలుగుమిల్లి సమీపంలోని తెలంగాణ-ఏపీ సరిహద్దు వద్దకు 500 వాహనాలు చేరుకున్నాయి. అయితే.. ఆంధ్రలోకి ప్రవేశించడానికి ఉన్నతాధికురుల నుంచి అనుమతి లేదని అక్కడున్న ఏపీ అధికారులు స్పష్టంచేశారు. దీంతో.. ప్రయాణికులు రోడ్లపై పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.

తెలంగాణ అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకునే వచ్చామని వాహనదారులు చెప్తున్నారు. అక్కడ పర్మిషన్‌ ఇవ్వగా.. ఇక్కడ ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. వెనక్కు వెళ్లడానికి తెలంగాణ అధికారుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని వాపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులో.. నడిరోడ్డుపై.. తమ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పర్మిషన్లు తీసుకుని వచ్చిన తమను.. ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని ప్రయాణికులు డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story